ఈఆర్‌సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు 

28 Sep, 2025 19:25 IST

నెల్లూరు: త‌న‌ అనుమ‌తి లేకుండా విద్యుత్ చార్జీల పేరుతో ప్ర‌జ‌ల‌పై భారం మోపినందుకు ప్ర‌భుత్వానికి ఏపీఈఆర్‌సీ త‌లంటితే సిగ్గుప‌డాల్సిందిపోయి.. ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లుగా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్రూడౌన్ వల్ల వినియోగ‌దారుల‌కు వెన‌క్కివ్వాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎందో ఉదారంగా తగ్గిస్తున్నట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వ‌స్తే విద్యుత్ చార్జీల‌ను త‌గ్గిస్తాన‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిందే కాకుండా, సీఎం అయిన ఏడాదిలోనే ప్ర‌జ‌ల‌పై చంద్ర‌బాబు రూ.19 వేల కోట్ల విద్యుత్ భారం మోపాడ‌ని ధ్వజమెత్తారు. నిద్రలేచింది మొద‌లు అబ‌ద్ధాలు చెప్పడం అల‌వాటుగా మార్చుకున్న చంద్ర‌బాబు, ఇళ్ల నిర్మాణం గురించి అసెంబ్లీలోనూ ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడార‌ని, వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో నిర్మించిన ఇళ్ల‌ను కూడా తానే క‌ట్టిన‌ట్టు ప్ర‌చారం చేసుకోవ‌డం సిగ్గుచేట‌ని కాకాణి మండిప‌డ్డారు. పదహారు నెలల్లో పేద‌వాడికి ఒక్క సెంటు ఇంటి స్థ‌లం ఇవ్వ‌లేని చంద్రబాబు ఏకంగా మూడు లక్షల ఇళ్ళు పూర్తి చేశానని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.. 

కూట‌మి ప్ర‌భుత్వానికి ఏపీఈఆర్‌సీ మొట్టికాయ‌లు 

కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తంలో రూ.923.55 కోట్లను ప్రజలకు వెనక్కి ఇవ్వాలని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) డిస్కంలను ఆదేశించింది. త‌మ అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల రూపంలో ప్ర‌జ‌ల నుంచి అక్రమంగా వ‌సూలు చేయ‌డంతో ఏపీ ఈఆర్‌సీ మొట్టికాయలు వేసింది. దీంతో ప్ర‌భుత్వం వెన‌క్కి ఇచ్చి తీరాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. కానీ అక్ర‌మంగా దోచుకున్న డ‌బ్బును వెన‌క్కి ఇవ్వ‌డం కూడా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్న‌ట్టు ఎల్లో మీడియాలో క‌ల‌రింగ్ ఇచ్చుకోవ‌డం సిగ్గుప‌డాల్సిన అంశం. ట్రూ అప్‌ చార్జీలపై విచారణ జరిపిన విద్యుత్‌ నియంత్రణ మండలి డిస్కంలు చెప్పిన లెక్కలు, కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసం గుర్తించి క్రమంగా వసూలు చేసిన మొత్తంలో రూ.923.55 కోట్లను ప్రజలకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. అధికారంలోకి వ‌చ్చాక విద్యుత్ చార్జీలు పెంచ‌న‌ని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్ర‌బాబు, కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన‌ ఏడాదిలోనే విద్యుత్ రూ.19వేల కోట్లు చార్జీలు పెంచ‌డ‌మే కాకుండా ఏపీ ఈఆర్‌సీ అనుమ‌తి కూడా తీసుకోలేదు. విద్యుత్ చార్జీలు పెంచ‌మ‌ని చెప్పి మాట త‌ప్పిన కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. దోచుకున్న సొమ్మును తిరిగివ్వాల‌ని విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి ఆదేశిస్తే దానికి ఎల్లో మీడియా రంగుల‌ద్ది చంద్ర‌బాబుని జాకీల‌తో పైకి లేపుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హ‌యాంలో ఎప్పుడూ విద్యుత్ చార్జీలు పెంచి ట్రూఅప్ చార్జీలు వ‌సూలు చేయ‌డం త‌ప్ప‌, చార్జీలు త‌గ్గించి ట్రూ డౌన్ చేయ‌డం లేద‌ని, నేడు చంద్ర‌బాబు హ‌యాంలో ట్రూ డౌన్ చేస్తున్న‌ట్టు గొప్ప ఘ‌న‌త‌గా ఎల్లో మీడియా ప్ర‌చారం చేస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఏనాడూ ఏపీ ఈఆర్‌సీ నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి ప్ర‌జ‌ల‌పై విద్యుత్ చార్జీల భారం మోప‌నేలేదు. ప్ర‌జ‌ల నుంచి ఒక్క రూపాయి కూడా లాక్కోవాల‌ని ఆలోచించ‌లేదు కాబ‌ట్టే చంద్ర‌బాబులా మొట్టికాయ‌లు తిన‌లేదు. త‌ప్పు చేసి అడ్డంగా దొరికిపోయి కూడా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తున్నాడ‌ని న‌మ్మించాల‌నుకోవ‌డం దారుణం.   

రూ.2,758.76 కోట్లు ప్ర‌తిపాదిస్తే రూ.1,863.64 కోట్లకే అనుమతి

2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్‌ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్‌) చార్జీలను డిస్కంలు ఈ ఏడాది జూలైలో ప్రతిపాదించాయి. ఇందుకు ఏపీఈఆర్‌సీ నుంచి అనుమతి కోరగా వీటిపై విచారణ జరిపిన ఏపీ ఈఆర్‌సీ డిస్కంలు చెప్పిన లెక్కలు, విద్యుత్‌ కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. డిస్కంలు అడిగిన దానికి యథాతథంగా ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లు తగ్గించి.. రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతినిచ్చింది. అలాగే గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీ ఈఆర్‌సీ అనుమతించిన దానికి మించిన ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసింది. ఏపీ ఈఆర్‌సీ యూనిట్‌కు రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్‌ యూనిట్‌ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్‌ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్‌ యూనిట్‌ రూ.5.89 వెచ్చించి విద్యుత్‌ కొన్నట్టు ప్రతిపాదనలో తెలిపాయి. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు కూడా రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే.. రూ.45,476 కోట్లు వెచ్చించామని డిస్కంలు చెప్పాయి. ఇందులో రూ.44,624 కోట్లకు ఏపీ ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. కాగా.. ప్రసార, పంపిణీ (ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌) నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్‌సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించింది.

యూనిట్ పై 40 పైస‌లు అద‌నంగా వ‌సూలు

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి నెలా యూనిట్‌కు రూ.0.40 పైసలు చొప్పున అదనంగా డిస్కంలు వసూలు చేశాయి. ఇందులో ఎస్పీడీసీఎల్‌ రూ.1,106.56 కోట్లు, సీపీడీసీఎల్‌ రూ.614.86 కోట్లు, ఈపీడీసీఎల్‌ రూ.1,065.76 కోట్ల చొప్పున ఇప్పటికే  రూ.2,787.18 కోట్లు వసూలు చేసేశాయి. ఈ మొత్తం నుంచి అనుమతించిన రూ.1,863.64 కోట్లు పోగా.. మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్‌ నెల బిల్లు నుంచి ట్రూ డౌన్‌ చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. అంటే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికంటే అదనంగా వసూలు చేశారని, దానిని 12 సమాన వాయిదాల్లో ప్రతి నెలా విద్యుత్‌ బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.13 పైసల చొప్పున సర్దుబాటు చేయాలని అదేశించింది. ఈఆర్‌సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టు. 2024 నవంబర్‌ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా.. ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అద‌న‌పు భారం మోపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి విని­యోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున అదనంగా వసూలు చేయడం ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకూ జనం డబ్బును అదనపు చార్జీల పేరుతో దోచేశారు. 


ఇళ్ల నిర్మాణంపై చంద్ర‌బాబు అస్యతాలు 

ఇళ్ల నిర్మాణం గురించి అసెంబ్లీలో ప‌చ్చి చంద్ర‌బాబు చెప్పాడు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ 15 ఏళ్ల కాలంలో పేద‌ల ఇళ్ల నిర్మాణం గురించి ఎంత‌మాత్రం ఆలోచ‌న చేశాడో ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. 6.15 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం జ‌రుగుతోందని, వ‌చ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామ‌ని చెప్ప‌డం ప‌చ్చి అబ‌ద్ధం. 'కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక 3 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించింది. అందుకోసం రూ.2200 కోట్లు ఖ‌ర్చు చేశాం. దీపావ‌ళి కానుక‌గా మ‌రో 3 ల‌క్ష‌ల ఇళ్లు పూర్తి చేస్తామ‌ని' మ‌రో అబ‌ద్ధం చెప్పాడు. బీసీఎస్సీల‌కు రూ.50 వేల వ‌ర‌కు, ఎస్టీల‌కు రూ.70వేల వ‌ర‌కు, ఆదివాసీల‌కు రూ.ల‌క్ష వ‌ర‌కు పెంచి ఇస్తున్నామ‌ని మ‌రో అబద్ధాన్ని వ‌ల్లె వేశాడు. అర్హులైన ప్ర‌తిఒక్క‌రికీ రెండు లేదా మూడు సెంట్లు ఇంటి స్థ‌లం ఇస్తున్నామ‌ని చెప్ప‌డం కూడా అబ‌ద్ధ‌మే. ప్ర‌జ‌లు చీద‌రించుకుంటార‌న్న సోయ లేకుండా 2029 నాటికి ఇళ్లు లేని వారు ఎవ‌రూ ఉండ‌ర‌ని మ‌రో డైలాగ్ చెప్పాడు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో విధ్వంసం చేశార‌ని య‌థావిధిగా పాత డైలాగులే చెప్పాడు. వాస్త‌వాలు చూస్తే సెంటు భూమి స‌మాధి క‌ట్టుకోవ‌డానికి కూడా స‌రిపోద‌ని చెప్పిన చంద్ర‌బాబు, ముఖ్య‌మంత్రిగా ఉన్న 15 ఏళ్ల‌లో పేద‌వాడికి ఒక్క సెంట్ ఇంటి స్థ‌లం కూడా కొనివ్వ‌లేదు. 

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో 9.02ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం పూర్తి 

వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో పేద‌ల ఇళ్ల నిర్మాణంపై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ పెట్టాం. దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేనివిధంగా ఐదేళ్లలో 31.19 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఇళ్ల ప‌ట్టాలు పంపిణీ చేశాం. దాదాపు 22 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణాలు ప్రారంభించాం. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం దిగిపోయే నాటికి 9.02 ల‌క్ష‌ల ఇళ్లు పూర్తి చేశాం. ఒక్కో ఏరియాలో వంద‌ల ఎకరాల్లో 10వేల‌కుపైగా లౌఅవుట్లు ఊర్ల‌ను త‌లపించేలా కొత్త‌గా ఇల్లు నిర్మించాం. పేద‌ల ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం 71,811 ఎక‌రాలు సేక‌రించాం. ఎక‌రం ఐదారు కోట్ల విలువ చేసే భూములను వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ‌మే కొని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇచ్చింది. ఒక్కో ఫ్లాటు విలువ రూ. 3.50 ల‌క్ష‌ల నుంచి రూ. 15 ల‌క్ష‌ల వ‌రకు ధ‌ర ప‌లుకుతోంది. రూ.76 వేల కోట్ల విలువైన ప్లాట్ల‌ను పేద‌ల‌కు ఇవ్వ‌డం జ‌రిగింది. 17,005 వైయ‌స్ఆర్ - జ‌గ‌న‌న్న కాల‌నీలు ఏర్పాట‌య్యాయి. 9.02 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం పూర్త‌యితే చాలా ఇళ్లు అనేక ద‌శ‌ల్లో ఉన్నాయి. దాదాపు 2 ల‌క్ష‌ల టిడ్కో ఇళ్ల‌ను ఒక్క రూపాయికే పేద‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అందించారు. కానీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక వాటికి న‌వ‌ర‌త్నాలు పేద‌లంద‌రికీ ఇళ్లు అనే పేరుని తీసేసి పీఎంఏవై ఎన్టీఆర్ న‌గ‌ర్‌లుగా మార్చడం త‌ప్ప చేసిందేమీ లేదు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం దిగిపోయే నాటికి 9.02 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం పూర్తయితే దాన్ని కూడా తామే పూర్తి చేశామ‌ని చంద్ర‌బాబు చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. 2024 ఎన్నిక‌ల నాటికి మ‌రో 2 ల‌క్ష‌ల ఇళ్లు పూర్త‌య్యే ద‌శ‌లో ఉంటే వాటిని కూడా చంద్ర‌బాబు త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు.

ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌కుండా అడ్డుకున్న‌ది చంద్ర‌బాబే

వైయ‌స్ జ‌గ‌న్ పేద‌ల‌కు ఇళ్లు క‌ట్టిస్తుంటే దాదాపు వెయ్యి కేసులేసి అడ్డుకోవాల‌ని చూశాడు. ఆఖ‌రుకి అమ‌రావ‌తి రాజ‌ధానిలో పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఇళ్ల ప‌ట్టాలిస్తే దాన్ని కూడా కేసులేసి చంద్ర‌బాబు అడ్డుకున్నాడు. చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు వెళ్లి మ‌రీ 50,793 ఇళ్లకు ఒకే చోట పట్టాలు పంచిన చరిత్ర జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. సెంటు స్థ‌లం స‌మాధి క‌ట్టుకోవ‌డానికి కూడా ప‌నికిరాద‌ని ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పేద‌ల ఇళ్ల‌పై విష‌ప్ర‌చారం చేశాడు. ఇంటి స్థ‌లంపై పేద‌వాడికి స‌ర్వ‌హ‌క్కులు క‌లిగేలా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా క‌న్వేయ‌న్స్ డీడ్ పేద‌ల పేరుతో ఇస్తే దాన్ని కూడా చంద్ర‌బాబు ఓర్చుకోలేక‌పోయాడు. క‌రోనా, కోర్టు కేసులు అధిగ‌మించి మ‌రీ రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మానం పూర్తి చేసిన ఘ‌న‌త వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంది. నాటి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 ల‌క్షలు ఇచ్చింది. డ్వాక్రా సంఘాల్లో స‌భ్యులుగా ఉన్న‌వారిని ఆదుకోవ‌డానికి రూ.35 వేలు పావ‌లా వ‌డ్డీకే ఇచ్చారు. అదే విధంగా రూ.15వేలు విలువ చేసే ఉచిత ఇసుక‌తోపాటు స్టీల్‌, సిమెంట్ వంటి 12 ర‌కాల సామ‌గ్రి కొనుగోళ్ల‌లో రూ.40 వేల మేర ల‌బ్ధి చేకూర్చారు. ఆ విధంగా ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 2.70 ల‌క్ష‌ల మేర ఖర్చు చేశాం. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో ఇంటి నిర్మాణం కోసం చేసిన ఖ‌ర్చు అక్ష‌రాలా రూ. 32,909 కోట్లు. 

టిడ్కో ఇళ్ల పేరుతో చంద్ర‌బాబు రూ.2203 కోట్ల అవినీతి

ఇళ్ల నిర్మాణం పేరుతో పేద‌వాడి మీద భారం మోపిన ఘ‌నుడు చంద్ర‌బాబు. 2016-17లో 300 చ‌ద‌ర‌పు అడుగులు, 365 చ‌ద‌ర‌పు అడుగులు, 415 చ‌ద‌రపు అడుగుల్లో మూడు ర‌కాల ఇళ్లను మూడు అంత‌స్తుల్లో నిర్మిస్తాన‌ని హామీ ఇచ్చాడు. 300 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం క‌లిగే ప్లాటుకు రూ. 2.60 ల‌క్ష‌ల ధ‌ర నిర్ణ‌యించి వారికి బ్యాంకు రుణం ఇప్పించి వారు నెల‌నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లపాటు దాదాపు రూ. 7.20 ల‌క్ష‌లు చెల్లించేలా ప్ర‌ణాళిక రూపొందించాడు. ఆ విధంగా పేద‌వాడి మీద బాంబు వేశాడు. నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నాడు. ముడుపులు ఎక్కువ‌గా ఇచ్చిన‌వారికి ఎక్కువ ధ‌ర‌కు, త‌క్కువ‌గా ఇచ్చిన కంపెనీకి త‌క్కువ ధ‌ర‌కు కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టాడు. 2016-17 మ‌ధ్య కాలంలో ఇంటి నిర్మాణం చ‌ద‌రపు అడుగుకి రూ.900 నుంచి రూ. వెయ్యి వ‌ర‌కు ఉంటే చంద్రబాబు మాత్రం రూ.  2534.75 నుంచి రూ.2,034.50ల‌కు ఇచ్చాడు. వెయ్యి రూపాయల‌తో పూర్త‌య్యే ఇంటిని స‌గ‌టు ధ‌ర 2,203తో కాంట్రాక్ట‌ర్‌కి అప్ప‌గించి దోచుకుతిన్నాడు చంద్ర‌బాబు.  ఆ విధంగా రూ.2203 కోట్లు దోచుకుతిన్నాడు. పేద‌వాడి ఇంటి నిర్మాణంలో కూడా చంద్ర‌బాబు భారీగా అవినీతికి పాల్ప‌డ్డాడు. ఆరోజు మార్కెట్ ధ‌ర‌తో పోల్చితే పేద‌ల నుంచి రూ.1200 లు అద‌నంగా వ‌సూలు చేశాడు. 

అసెంబ్లీ స‌మావేశాల్లో కాల‌క్షేపం

అసెంబ్లీ స‌మావేశాల‌న్నీ కూట‌మి స‌భ్యుల కాల‌క్షేపానికి వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గన్ గారిని నిందించ‌డానికి, చంద్ర‌బాబు, లోకేష్ గొప్ప‌లు చెప్పి పొగిడించుకోవ‌డానికే వాడుకున్నారు త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టే క‌నిపించ‌లేదు. స‌భ్యుల నోటి వెంట నోరు తెరిస్తే అబ‌ద్ధాలు త‌ప్ప మ‌రోటి వినిపించ‌లేదు. ఎమ్మెల్యే బాల‌కృష్ణ మాట‌ల‌కు చిరంజీవి ఇచ్చిన కౌంట‌రే చిన్న ఉదాహ‌ర‌ణ‌.