టీడీపీలో రోజుకో ‘రత్నం’ బయట పడుతోంది

24 Mar, 2026 16:34 IST

నెల్లూరు: టీడీపీలో రోజుకో ‘రత్నం’ బయట పడుతోందని, రాసలీలలు, అసాంఘిక కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులు మునిగి తేలుతున్నారని, వారిని ఆ కేసుల నుంచి తప్పించడమే పోలీసుల పనిగా మారిందని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. మహిళతో గడుపుతున్న ఎమ్మెల్యేను తప్పించడానికి కరెంటు తీసేస్తారా? అని ప్రశ్నించిన ఆయన, పోలీసుల పని ఇదేనా? అని నిలదీశారు. నెల్లూరులో రైడ్‌ చేసినప్పుడు లాడ్జిలో వ్యభిచారం చేస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన టీడీపీ నాయకుడు రాధాకృష్ణమనాయుడిని పోలీసులు ఎలా వదిలేస్తారని కాకాణి ప్రశ్నించారు. తప్పు చేసి సిగ్గుతో తలదించుకుని కౌన్సిలింగ్‌లో కూర్చున్న రాధాకృష్ణమనాయుడు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినా, కేవలం ఆయన అధికార పార్టీ నాయకుడు కావడంతో వదిలేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయన ఆస్పత్రికి వచ్చాడని చెబుతున్న పోలీసుల మాటల్లో నిజముంటే అందుకు సంబంధించిన వీడియో ఆధారాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. దీంతోపాటు నెల్లూరులో పోలీసులు లాడ్జిలపై రైడింగ్‌ చేసిన వీడియోలు కూడా రిలీజ్‌ చేయాలని  నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కోరారు.
ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:
 
పోలీసుల తీరు దారుణం:
    టీడీపీ కూటమి నాయకులు ఎలాంటి అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వారిని వదిలేస్తున్న పోలీసులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిందితులను వదిలేసి బాధితులను వేధిస్తున్న కొందరు పోలీసుల కారణంగా మొత్తం పోలీస్‌ వ్యవస్థ తలదించుకునే పరిస్థితి వచ్చింది. నెల్లూరులో టీడీపీ నాయకుడు రాధాకృష్ణమనాయుడు వ్యభిచారం చేస్తూ దొరికాడు కాబట్టే కౌన్సిలింగ్‌లో  కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఏవో సాకులు చెప్పి వదిలేయడం దారుణం.
    ఎలాంటి అనైతిక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా మాకేం కాదు.. ప్రభుత్వం మాకు అండగా ఉందనే ధీమాతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. నేరాలు చేస్తూ ఆధారాలతో సహా దొరికిన వారిని కూడా తప్పించడానికి పోలీసులు ఏ మాత్రం వెనుకాడటం లేదు.
    ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు, చౌటపాళెం ప్రాథమిక వ్యవసాయ సహకార సం«ఘం అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణమనాయుడు ఒక లాడ్జిలో ఓ మహిళతో గడుపుతూ, పోలీసుల రైడింగ్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసుల రైడింగ్‌ జరిగింది. అప్పుడు పట్టుబడిన 17 మంది విటుల్లో రాధాకృష్ణమనాయుడు కూడా ఒకడు. ఆయన్ను పోలీస్‌ స్టేషన్‌లో కూర్చోబెట్టి ఏఎస్పీ కౌన్సిలింగ్‌ ఇస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కానీ పోలీసులు మాత్రం ఆయన సాయి గ్రాండ్‌ లాడ్జి సమీపంలోకి ఆస్పత్రి పని మీద వచ్చినట్టు తెలియడంతో విడిచిపెట్టామని చిన్న బజార్‌ సీఐ చినకోటేశ్వరరావు పేరుతో నోట్‌ రిలీజ్‌ చేయడం సిగ్గుచేటు.
    తప్పు చేసిన రాధాకృష్ణమనాయుడు సిగ్గుతో కౌన్సిలింగ్‌లో తల దించుకుని కూర్చున్నట్టు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు ఆయన్ను వదిలేశారు. టీడీపీ అనుకూల పత్రిక ఈనాడులో సైతం పోలీసుల దాడిలో టీడీపీ నాయకుడు దొరికినట్టు రాసింది. అయినా అధికార పార్టీ నాయకుడు కాబట్టి తప్పు చేసినా పోలీసులు వదిలేయడం సిగ్గుచేటు. 

యథేచ్ఛగా లైంగిక వేధింపులు:
    టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు రాసలీలల వీడియో వైరల్‌ అయినా ఆయనపైనా ఇంతవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. బీఆర్‌ నాయుడు బాధితురాలు, గత ఎన్నికలకు ముందు ఏకంగా చంద్రబాబుకి లేఖ రాసినా ఆయన పట్టించుకోలేదు. అధికారంలోకి రాగానే పవిత్రమైన టీటీడీ ఛైర్మన్‌ పదవిని బీఆర్‌ నాయుడికి కట్టబెట్టాడు. బీఆర్‌ నాయుడు టీటీడీ ఛైర్మన్‌ అయినప్పటి నుంచి తిరుమలలో, శ్రీవారి ఆలయం వద్ద అనేక అపచారాలు జరుగుతున్నాయి. చివరకు కేవలం టీటీడీ నిర్లక్ష్యం వల్ల తిరుపతిలో తొక్కిసలాటకు ఆరుగురు బలైనా, టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయినా.. ఏనాడూ బీఆర్‌ నాయుడు పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. ప్రతి సందర్భంలోనూ అడ్డంగా మాట్లాడారు. చివరకు తన రాసలీలల వీడియోలు బయటకు వచ్చినా, ఏ మాత్రం సిగ్గు లేకుండా సమర్థించుకున్నారు. మరో అడుగు ముందుకేసి ఏకంగా ఎదురుదాడికి దిగారు. తనకూ మీడియా ఉందని, తానెవ్వరికీ భయపడబోనని బెదిరించే ప్రయత్నం చేశారు.
    ఇంకా ఇటీవల నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య కూడా ఇలాగే ఒక లాడ్జిలో అడ్డంగా దొరికిపోతే అరెస్ట్‌ చేయాల్సిన పోలీసులు లైట్లు ఆపేసి ఆయన్ను తప్పించారు. అంతటితో ఆగకుండా పోలీసులే పనిగట్టుకుని చుట్టుపక్కలంతా వెతికి సీసీ టీవీ ఫుటేజ్‌లను సైతం మాయం చేశారు. గతంలో ఇదే విధంగా టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దొరికిపోయాడు. రైల్యేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ లైంగిక వేధింపుల గురించి మహిళా ఉద్యోగి నేరుగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లకు ఫిర్యాదు చేసింది. కానీ ఇంతవరకు ఆమెకు న్యాయం జరగలేదు. గుంటూరు ఎమ్మెల్యే నసీర్‌ అశ్లీల వీడియో కాల్‌ వెలుగు చూసింది. ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేళ కాని వేళలో ఫోన్‌ చేసి కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్‌ని వేధించాడు. మంత్రి సంధ్యారాణి పీఏ లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగుచూస్తే బాధితురాలిపైనే కేసులు పెట్టారు.

చంద్రబాబుపై భరోసా. అందుకే బరితెగింపు:
    ఇప్పుడు తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కాల్‌ డేటా రికార్డింగ్‌ వ్యవహారం దుమారం రేపుతోంది. తప్పు చేసినా చంద్రబాబు చూసుకుంటాడులే అనే అదే ధైర్యంతో బీఆర్‌ నాయుడు బాటలోనే టీడీపీ నాయకులు మరింత బరితెగించి పోతున్నారు. 
    ఎక్కడైనా బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. పైగా వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఇంకా బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి వేధించే విష సంస్కృతికి చంద్రబాబు తెర లేపాడు. పోలీసులు కూడా చట్టాలను గౌరవించకుండా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి దోషులను నిర్దోషులుగా వదిలేయడం సిగ్గుచేటు.

ఎవ్వరినీ వదిలిపెట్టబోము:
    ఇప్పుడు తప్పు చేస్తున్న పోలీసులు ఎవ్వరినీ వదిలిపెట్టబోము. రేపు మా ప్రభుత్వం వచ్చాక పోలీస్‌లు వ్యవహరించిన తీరుపై విచారణ చేయిస్తాం. నిందితులను వదిలేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అందుకే గతి తప్పి వ్యవహరిస్తున్న పోలీసులు ఇప్పుడైనా తమ వైఖరి మార్చుకోవాలని, తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి హితవు చెప్పారు.