వైయ‌స్ జగన్‌కు పేరొస్తుందనే కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీపై నిర్ల‌క్ష్యం

26 Mar, 2026 12:21 IST

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పేరొస్తుంద‌నే క‌క్ష‌తో పులివెందుల మెడిక‌ల్ కాలేజీని కూట‌మి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌కుమార్ రెడ్డి మండిప‌డ్డారు.  పులివెందుల మెడికల్ కాలేజీని అఖిలపక్ష బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌కుమార్ రెడ్డి,   పులివెందుల మెడికల్ కాలేజీని కూమి ప్ర‌భుత్వం లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లను ప్రభుత్వం వెనక్కు పంపించడం తీవ్ర అన్యాయమని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న కాలేజీకి సీట్లు తగ్గించడం ద్వారా స్థానిక విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు.

అలాగే కాలేజీలో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించడం దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. “పులివెందులలో అభివృద్ధి జరిగిన ప్రతి అంశాన్ని చెరిపివేయాలనే కుట్ర జరుగుతోంది” అని ఆయన ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో నియమించిన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సహా పెద్ద ఎత్తున సిబ్బందిని బదిలీ చేయడం వల్ల కాలేజీ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సతీష్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఫలితంగా ఒకప్పుడు అత్యాధునిక సదుపాయాలతో నిలిచిన ఈ మెడికల్ కాలేజీ, నేడు సాధారణ ఆస్పత్రిలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అఖిలపక్ష బృందం కాలేజీని పరిశీలించిన తర్వాత రోగులు, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకుంది. ప్రైవేటీకరణ చర్యలు కొనసాగితే పేదలకు వైద్య సేవలు అందకుండా పోతాయని హెచ్చరించిన నేతలు, వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.