టీడీపీ, బీజేపీలు సీఎం వైయస్ జగన్ పై ఆరోపణలు చేయడం తగదు
తిరుమల : టీడీపీ, బీజేపీ పనిగట్టుకొని సీఎంవైయస్ జగన్ పై ఆరోపణలు చేయడం తగదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి శనివారం దర్శించుకున్నారు. అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. కులమత వ్యత్యాసాలు లేకుండా.. పార్టీల విద్వేషాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు.
పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలని, విద్యావంతులు కావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని దేవాలయాలు పునరుద్దరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పచ్చ మీడియా కలిసి సీఎం వైయస్ జగన్‌ను మతాన్ని ఆపాదించడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ పనిగట్టుకొని సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. పేదలపై ప్రేమ, ఆప్యాయత లేని వ్యక్తి చంద్రబాబు అని.. ఒక్క పేద కుటుంబానికైనా ఇంటి స్థలాన్ని చంద్రబాబు ఇచ్చాడా అని నారాయణ స్వామి ప్రశ్నించారు.