పోతిరెడ్డిపాడుకు త‌ర‌లిరండి

4 Feb, 2026 15:01 IST

నంద్యాల: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం నిర్వహిస్తున్న ‘ఛలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి ఆవిష్కరించారు. గురువారం (ఫిబ్రవరి 5) జరగబోయే పోతిరెడ్డిపాడు వద్ద భారీ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాటసాని రామభూపాల్ రెడ్డి, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అమలు కాకపోతే సీమలోని అన్ని ప్రాంతాలు కరువుతో అల్లాడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ఎత్తిపోతల పథకంలో 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులు జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5న జరిగే ఈ కార్యక్రమాన్ని సీమ ప్రజలు, రైతులు, పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 1990 నుంచే చంద్రబాబు రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించిన కాటసాని రామభూపాల్ రెడ్డి, సీమ ప్రజలకు నీరు అందే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.