ప్రశ్నించే వారిపై వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారా ?
తాడేపల్లి : రాష్ట్రంలో రెండేళ్ల పాలనలో దారుణంగా విఫలమైన కూటమి ప్రభుత్వం, ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీపై, అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు, కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతోందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబుతో పాటు మంత్రులు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సీమలో ఫ్యాక్షన్, నక్సలిజాన్ని రూపుమాపి, రాష్ట్రాన్ని సంక్షేమంలో మేటిగా పట్టించిన రాజశేఖర్ రెడ్డితో పాటు పేద ప్రజల కోసం ఆస్పత్రులు కట్టించిన రాజారెడ్డిపై టీడీపీ నేతలు నీచంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇకనైనా కూటమి సర్కార్ ఇలాంటి నీచపు విమర్శలను కట్టిపెట్టాలని, పాలనపై దృష్టిసారించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు.
ప్రెస్ మీట్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇంకేమన్నారంటే..
- హామీలు నెరవేర్చకుండా జగన్ పై దాడులా ?
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నాఇంతవరకూ ఎన్నికల్లో చెప్పిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చలేదు. పాలనలో పూర్తిగా విఫలమై, దాన్నుంచి తప్పించుకునేందుకు విపక్ష పార్టీ అయిన వైయస్ఆర్‌సీపీని, పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్ ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవైపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని పదే పదే అడుగుతూ..మరోవైపు ఆయన ప్రెస్ మీట్లలో వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా ఆయనపై, కుటుంబ సభ్యులపై దాడులకు దిగుతున్నారు. దాదాపు 3.50 లక్షల కోట్లు అప్పు చేశారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మాత్రం అమలు కాలేదని అడుగుతుంటే, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారు. అధికారికంగా మీ అసెంబ్లీ రికార్డుల్లో, పార్లమెంట్ రికార్డుల్లో చూసినా మేం తీసుకున్న అప్పును భారీ ఎత్తున సంక్షేమానికి ఖర్చు చేసినట్లు అర్దమవుతుంది. మ్యానిఫెస్టోను ఓ భగవద్గీత, ఖురాన్, బైబిల్ లా భావించి ఇచ్చిన అన్ని హామీలు సంవత్సరం లోపే వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారు. కానీ మీరేం చేస్తున్నారు ? వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కార్పోరేషన్లతో సహా మొత్తం అప్పులన్నీ కలిపి ఐదేళ్లలో 3.33 లక్షల కోట్లు అప్పులు చేస్తే, మీరు ఈ రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాక ముందే 3.5 లక్షల కోట్లు అప్పులు చేశారు. దాని మీద ప్రశ్నిస్తే పాత అబద్దాలతో ఎదురుదాడి చేస్తున్నారు.
- ప్రశ్నించే వారు లేకుండా చేద్దామనే యత్నం
శాంతి భద్రతల పరిస్ధితి చాలా దారుణంగా ఉంది. రాజకీయ హత్యలు చేస్తుండటమే కాకుండా భారీ ఎత్తున మహిళలపై, బాలికలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలు బయటికి రావాలంటే భయపడే పరిస్ధితి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు మిస్సయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు జరుగుతున్న అరాచకాలపై మాత్రం నోరు మెదపడం లేదు. వందల సంఖ్యలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఆయనకు మాట్లాడే ధైర్యం లేదు. సుగాలి ప్రీతి ఘటన చంద్రబాబు ప్రభుత్వంలో జరిగింది. సుగాలి ప్రీతి కేసు తేలుస్తానంటూ ఊగిపోయిన వారు.. ఇప్పుడు మాట మాత్రం స్పందించకుండా దాక్కుంటున్నారు. వినుకొండలో ఎన్నికలు పూర్తి కాగానే రషీద్ అనే మైనార్టీ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. దీనిపైనా ఇప్పటివరకూ ఎలాంటి చర్యల్లేవు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అకృత్యాలతో పాటు ఫ్యాక్షన్ రాజకీయాల్ని సైతం ఉసిగొల్పుతున్నారు. పోలీసుల సాయంతో టార్గెట్ చేసి ప్రశ్నించే వారు లేకుండా చేద్దామనుకుంటున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రెండు నెలల్లోనే ఎలాంటి వివాదం లేకుండా లక్షా 30 వేల ఉద్యోగాలు కల్పించారు. ఈ రోజు గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ పోస్టుల్ని పెంచుతున్నామని హంగామా చేసి పూర్తిగా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రశ్నాపత్రం తయారు చేసిన వ్యక్తినే టాపర్ గా మార్చి, మెరిట్ లిస్ట్ బయటపెట్టకుండా ఉద్యోగాలను రూ.15-20 లక్షలకు అమ్ముకున్నారు. కేవలం 15 వేల ఉద్యోగాలు పారదర్శకంగా ఇవ్వలేకపోయారు. ఉద్యోగులకూ బకాయిలు, డీఏలు, ఐఆర్ ఏదీ ఇవ్వలేదు. ప్రశ్నిస్తే మాత్రం పోలీసుల సాయంతో టార్గెట్ చేస్తున్నారు.
- చనిపోయిన వారినీ రాజకీయాలకు వాడుకుంటారా ?
మంత్రులు తమ శాఖల ద్వారా ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించడం మానేసి కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తే చాలన్న పరిస్ధితికి వచ్చేశారు. అక్కడితో ఆగకుండా చనిపోయిన రాజారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సీమలో మా జీవితాలతో ఆడుకుంది ఎవరు ? అభివృద్ది చెందాల్సిన ప్రాంతంలో మీ రాజకీయాల కోసం ఫ్యాక్షన్ రెచ్చగొట్టి లబ్ది పొందింది ఎవరో చెప్పాలి. చంద్రబాబు సీఎంగా ఉండి తనను కూడా తాను రక్షించుకోలేని పరిస్ధితుల్లో ఉన్నప్పుడు 2004లో ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి పూర్తిగా ఫ్యాక్షన్, నక్సలిజాన్ని రూపుమాపారు. 1984 నుంచి రాజారెడ్డి గారు చనిపోయిన 1999 వరకూ చంద్రబాబు, ఎన్టీఆర్ , లేదా రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యర్ధులుగా ఉన్న వారు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి మాత్రం విపక్షంలోనే ఉన్నారు. అప్పుడు విపక్షంలో ఉన్న రాజారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ? ఆయన తప్పు చేయలేదు కాబట్టే చర్యలు తీసుకోలేదా ? లేక తప్పు చేసినా మీకు చేతకాక చర్యలు తీసుకోలేదా చెప్పాలి.
- సీమలో ఫ్యాక్షన్, నక్సలిజం నిర్మూలించింది రాజశేఖర్ రెడ్డి
రాజశేఖర్ రెడ్డి గారు సాచురేషన్ మోడ్ లో ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు తెచ్చారు. హైదరాబాద్ నిర్మించానని చెప్పుకునే చంద్రబాబు .. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టు, మెట్రో తెచ్చిన విషయం మర్చిపోయారా ? పెన్షన్లను అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇచ్చారు. కానీ చంద్రబాబు హయాంలో రూ.70 ఉన్న పెన్షన్లు కూడా ఎవరైనా చనిపోతే కొత్తగా ఇంకొకరికి ఇచ్చే పరిస్ధితి. కానీ రాజశేఖర్ రెడ్డి గారి వంటి వ్యక్తి గురించి మాట్లాడి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు. పరిటాల రవి హత్య జరిగితే సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్లకు కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం ఫ్యాక్షన్ ను అరికట్టేందుకు ముందుకు రాలేదు. వివేకానందరెడ్డిని చంపిన వ్యక్తిని కాపాడుతూ, ఆయనకూ, మీకూ ఒకే లాయర్ ను పెట్టుకున్నారంటే ఇందుకు కుట్ర ఏంటో అర్ధం చేసుకోవచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు తన కుటుంబాన్ని త్యాగం చేసి, ఆస్తుల్ని అమ్ముకుని మరీ అనేక నాయకుల కోసం బతికారు. కానీ నిన్న మాట్లాడిన మంత్రి పయ్యావుల కేశవ్.. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. గతంలో తాము తినే ప్రతీ మెతుకు మీద రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారని ఆయన చెప్పలేదా ? రాజకీయాల కోసం ఇంత దిగజారాలా ? పదవుల కోసం, నాయకుల మెప్పు కోసం ఏది పడితే అది మాట్లాడటం సరికాదు. మేమూ ఏన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం. కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. కానీ ఇప్పుడు వీళ్లు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు. వ్యక్తిగతంగా దాడులు చేస్తూ కుటుంబాల్ని లాగడం, ఇష్టానుసారంగా హేళన చేయడం చేస్తున్నారు. మీరు ఏదైనా చేయొచ్చు, ప్రశ్నిస్తే మాత్రం వ్యవస్థలతో ఎదురుదాడి చేయిస్తున్నారు. మీరు కరెక్ట్ అయితే ప్రశ్నించే వారికి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు.
- ఇకనైనా నీచ రాజకీయాలు కట్టిపెట్టండి
ఈ రెండేళ్లలో ఎంతో మంది వృద్దులు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయినా ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా ? వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు 66 లక్షల పెన్షన్లు ఇస్తే అందులో 6 లక్షల పెన్షన్లు తీసేశారు. మీకు ధైర్యం ఉంటే అర్హత పొందిన వారికి పెన్షన్ డబ్బు సకాలంలో ఇవ్వాలి. మహిళలకు 1500 ఇస్తామన్నారు, దానికీ అతీగతీ లేదు. నిరుద్యోగులకు భృతీ లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్నారు. దానికీ అతీ గతీ లేదు. వీటి గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అని డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతూ.. వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. రాబోయే రోజుల్లో మీరు చేసిన పనే మేమూ చేస్తే ఎవరు ఆపుతారు ? అధికారంలో ఉన్నవాళ్లకు ఓపిక ఉండాలి. అంత అభద్రతా భావం వస్తుందంటే మీరు విఫలమైనట్లే. మరోసారి వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా, చెప్పింది ఎందుకు చేయలేకపోతున్నారో, ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పు చేస్తున్నారో చెప్పాలి. రాయలసీమ లిఫ్ట్ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడితే ఇంతవరకూ సమాధానం లేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విని ఓ ప్రాంత ప్రజల గొంతు కోశారు. హైకోర్టు మా ప్రాంతానికి లేకుండా చేశారు. లా యూనివర్సిటీని సైతం మార్చేశారు. రాయలసీమలో శ్రీసిటీ వచ్చినా, కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ఏర్పడినా, ఓర్వకల్లులో ఎయిర్ పోర్టును ఎవరు తెచ్చారో ఆలోచించాలి. హంద్రీనీవాను వేగంగా పూర్తి చేసి దేశంలో అత్యధికంగా హార్టీకల్చర్ జరిగేలా చేసిన వ్యక్తి దోచుకున్నట్లా చెప్పాలి. కాబట్టి ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలకు పుల్ స్టాప్ పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.