ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం గిట్టుబాటు కాక నష్టాలపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని, ప్రతి వారం కనీసం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని వైయస్ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ ( వ్యవసాయం మరియు రైతు సంక్షేమం) ఎంవీయస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలోనే 300 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కానీ ఏ ఒక్కరికీ పరిహారం చెల్లించి ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే పరిస్థితి దాపురించిందని చెప్పారు. మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే గొప్పలు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించి చూపించాలని డిమాండ్ విసిరారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారాన్ని పెంచి తక్షణం చెల్లించాలని, ఆ సాయాన్ని కూడా నేరుగా బాధిత కుటుంబ సభ్యుల ఖాతాల్లోనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యవసాయంపై చిత్తశుద్ధి ఉంటే గత వైయస్ఆర్‌సీపీ హయంలో మాదిరిగా ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణం పథకాలను అమలు చేసి అండగా నిలవాలని సూచించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
-ఆత్మ హత్యల బాధిత కుటుంబాలకు రూ. 116 కోట్లు చెల్లించిన వైయస్ జగన్
చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాడు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పంటల దిగుబడి మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఫలితంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న అన్నదాతలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మానవతాదృక్పథంతో ఆలోచించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. అలాంటి సంకల్పంతోనే దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ గారు 2004లో మే రెండో వారంలో ప్రమాణ స్వీకారం చేసి జూన్ మొదటి వారంలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అంతకుముందున్న చంద్రబాబు పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా చెల్లించడం జరిగింది. 2014 -19 మధ్య మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలే లేవని ప్రకటించి ఆత్మహత్య బాధిత రైతు కుటుంబాలకు క్షోభను మిగిల్చారు. 2019లో వైయస్ జగన్ గారు సీఎం అయ్యాక జీవో నెంబర్ 43 రిలీజ్ చేసి అంతకుముందు ఐదేళ్ల టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. అంతేకాకుండా వైయస్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 1320 కుటుంబాలకు రూ. 7 లక్షల వంతున పరిహారం అందజేశారు. ఆత్మహత్య కారణంగా రోడ్డున పడిన కుటుంబాలను ఎంతో పెద్ద మనసుతో వైయస్ జగన్ గారు ఆదుకుని అండగా నిలిచారు. మొత్తం 1794 మంది రైతుల కుటుంబాలకు రూ. 116 కోట్లు పరిహారం అందించి ఆదుకున్నారు. ఇది కూటమి నాయకులు హెలిక్యాప్టర్ ప్రయాణాలకు చేస్తున్న ఖర్చుల్లో ఎన్నో వంతు?
- పల్నాడులో దాదాపు 30 మంది ఆత్మహత్య
కూటమి ప్రభుత్వం వచ్చాక 18 నెలల కాలంలో 300 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి వారం కనీసం ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఉండటం లేదు. రూ. 7 లక్షల పరిహారం పెంచుతామని హామీ ఇవ్వలేదు సరికదా.. ఈ ఏడాదిన్నర కాలంలో ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతు కుటుంబానికి కూడా ప్రభుత్వం ఒక్క పైసా సాయం చేయలేదు. 2024-25 లో కేవలం పల్నాడు ఏరియాలోనే 21 మంది రైతులు, 2025-26లో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బాధిత రైతుల పేర్లతో సహా ఒకపత్రిక ప్రత్యేక కథనం కూడా రాసింది. ఆత్మహత్యలు జరిగిన మాట వాస్తవమేనని, అధికారికంగ ప్రకటించాల్సి ఉందని జిల్లా వ్యవసాయాధికారి స్వయంగా చెప్పారు. అనంతపురం జిల్లాలో అరటి రైతు ఆత్మహత్య చేసుకుంటే, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజామున హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించి పంపారు. కౌలు రైతులను ఈ ప్రభుత్వం అస్సలు గుర్తించడం లేదు.
- గతంలో మాదిరిగా ఈ పథకాలన్నీ అమలై ఉంటే...
వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతు భరోసా పథకం ద్వారా 53.58 లక్షల మంది రైతులకు రూ. 34,288 వేల కోట్లు చెల్లించడం జరిగింది. ఉచిత పంటల బీమా కింద రూ. 7802 కోట్లు అందజేయడం జరిగింది. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ. 3,261 కోట్లు, సున్నావడ్డీ రుణాల కింద రూ. రూ. 2051 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ పథకాలేవీ నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు కావడం లేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20 వేలు ఇస్తామని చెప్పి మొత్తం రూ. 40 వేలకుగాను రెండేళ్లలో కేవలం రూ. 10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో 75 కేజీల బస్తా సూపర్ ఫైన్ బియ్యం 1800 రూ నుండి.2000 లు అమ్మితే.. నేడు కనీసం రూ. 1350కి కొనడం లేదని టీడీపీ అనుకూల పత్రికల్లోనే కథనాలు వస్తున్నాయి. మిర్చి, పొగాకు, అరటి, మొక్కజొన్న, పత్తి, ఉల్లి, టమాట, చెరకు, చీనీ, మామిడి.. ఏ పంట చూసినా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు పండిచారని ప్రశ్నిస్తున్నాడంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు. వైయస్ఆర్‌సీపీ హయాంలో అన్ని పంటలను గిట్టుబాటు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. చరిత్రలో తొలిసారి బ్యారన్ పొగాకుకి కూడా మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేసిన ఘనత వైయస్ జగన్ గారి నేతృత్వంలోని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. ఏ విపత్తు వచ్చినా రైతుకి ప్రభుత్వం అండగా ఉందన్న భరోసా ఇచ్చింది. రెండేళ్లు కోవిడ్‌తో ఇబ్బంది పడినా రైతు చేయి వదల్లేదు. ప్రతి పంటకూ గిట్టుబాటు ధర చెల్లించి వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు వైయస్ జగన్ గారు. ఏడాదిన్నరలోనే రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు..ఏ ఒక్క పంటకీ మద్ధతు ధర చెల్లించకా, ఏ ఒక్క ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరిహారమూ ఇవ్వక ఆ డబ్బంతా ఏం చేస్తున్నట్టు? ఇంటికి పెద్దను కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అన్నదాత ఉసురు పోసుకోవడం మంచిది కాదు.
- వైయస్ఆర్‌సీపీ హయాంలో గణనీయంగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి
గత టీడీపీ హయాంలో 2014-19 మధ్య సరాసరిన 121 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగితే, వైయస్ఆర్‌సీపీ హయాంలో ధాన్యం సరాసరిన 128 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఆహార ధాన్యాలు మొత్తం తీసుకుంటే గత టీడీపీ హయంలో 153.95 లక్షల టన్నులు వైయస్ఆర్‌సీపీ హయాంలో 161.95 లక్షల టన్నులు జరిగింది. ధాన్యం హెకటారు సరాసరి దిగుబడులు చూసినా గత టీడీపీ పాలనలో 5499 కేజీలుంటే వైయస్ఆర్‌సీపీహయాంలో ప్రతి హెక్టార్‌కి 5620 కేజీలు దాటింది. అలాగే ఆహార ధాన్యాల దిగుబడి చూసినా గత టీడీపీ హయాంలో 3793 కేజీలు కాగా, వైయస్ జగన్ పాలనలో ఆహారధాన్యాల దిగుబడి 4142 కేజీలకు పెరిగింది. ఇవన్నీ ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం చెప్పిన లెక్కలే..
-ఆంధ్రప్రదేశ్ జీడీపీలో వ్యవసాయం వాటా 37 శాతం..
తెలంగాణలో వ్యవసాయం మీద 100కి రూ.9 లు ఆదాయం వస్తే ఏపీలో కేవలం 6 రూపాయలే వస్తున్నాయని సీఎం చంద్రబాబు చెప్పడం ఆయన అనుభవానికి తీరని కలంకం తెచ్చుకోవడమే. రాష్ట్ర విభజన తర్వాత సేవారంగాలు, పారిశ్రామిక రంగాలు తెలంగాణకే వెళ్లిపోయాయి. ఏపీ కేవలం వ్యవసాయాధారిత రాష్ట్రంగానే ఉంది. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి చూస్తే రాష్ట్ర జీడీపీలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వాటా తెలంగాణలో 14 నుంచి 17 శాతం వరకు ఉంటే, ఆంధ్ర్రప్రదేశ్‌లో మాత్రం 30 శాతం నుంచి 37 శాతం ఉంది. కానీ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసేసింది. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మాదిరిగానే రైతులను ఆదుకుని ఉంటే రైతులకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితే రాదు. రైతులు వ్యవసాయం చేసేది వారి కుటుంబానికి మాత్రమే కాదు.. ఈ దేశం కోసం అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
- డబుల్ ఇంజిన్ సర్కార్ అని చేతల్లో చూపించండి
ప్రభుత్వం తక్షణం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పెంచి చెల్లించాలి. మరణం జరిగిన మానవతాదృక్పథంతో వారం పది రోజుల్లోనే పరిహారం చెల్లించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. అంతేకాకుండా ఆ పరిహారాన్ని అప్పులిచ్చిన వ్యాపారులకు కాకుండా గతంలో వైయస్సార్, వైయస్ జగన్ గారు చేసిన విధంగా పరిహారాన్ని కూడా నేరుగా బాధిత కుటుంబాలకే చెల్లించాలి. కేంద్రం సపోర్టుతో, మార్క్‌ఫెడ్ ద్వారా పంటలను కొనుగోలు చేసి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలువరించాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ అని మాటల్లో చెబితే సరిపోదు.. కేంద్రం, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కన్నా మరింత మేలు చేయాల్సిందిపోయి రైతును దగా చేయడం రైతు సంఘాలు సహించడం లేదని ఎంవీయస్ నాగిరెడ్డి మండిపడ్డారు.