ఎంపీ అవినాష్‌రెడ్డికి ముస్లింల సత్కారం

వైయస్ఆర్ జిల్లా: దేశ లౌకిక వ్యవస్థకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా చేసిన వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ఓటు వేసిన ఎంపీ అవినాష్‌రెడ్డిని ముస్లిం మైనారిటీలు సత్కరించారు. గురువారం పులివెందులలోని తన నివాసం వద్ద ముస్లిం మైనారిటీ నేతలు ఎంపీని కలిసి దుశ్శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లుకు తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ, తెలుగుదేశం, జనసేనలు మద్దతు పలికి మత విద్వేషాలను రగిలించి ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఈ చట్టాన్ని సమర్థించడం ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ముస్లీంల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని వ్యక్తిగత, మతపరమైన స్వేచ్ఛలకు విఘాతం కలిగించేలా, న్యాయస్థానాల తీర్పులకు భిన్నంగా వక్ఫ్ సవరణ చట్టంను కేంద్రం చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన రాజ్యాంగ విరుద్దమైన బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లోనూ వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించడంతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ముస్లింలకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ముస్లింలకు అండగా నిలిచిన వైయస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.