రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో హత్యారాజకీయాలు

16 Jan, 2026 13:04 IST

తాడేప‌ల్లి: రెడ్‌బుక్ రాజ్యాంగం ముసుగులో రాష్ట్రంలో హత్యారాజకీయాలు సాగుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  మండిపడ్డారు. కక్షపూరిత రాజకీయాల ఫలితంగానే గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ కిరాతకంగా హత్యకు గురయ్యాడని ఆయన ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు సొంత గ్రామానికి వచ్చిన సాల్మన్‌పై ఇనుప రాడ్లతో దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటన బాధాక‌ర‌మ‌న్నారు. పైగా హత్యకు గురైన వ్యక్తిపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం అత్యంత అమానుషమని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్షలతో హింసను ప్రోత్సహిస్తోందని, ఇది స్పష్టమైన రాజ్యాంగ ఉల్లంఘన అని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి వైయస్‌ఆర్‌సీపీ పూర్తిగా అండగా నిలుస్తుందని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
చంద్ర‌బాబు గారూ.. మీరు పాలించడానికి అర్హులేనా? రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలితీసుకుంటారు? ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగం, పొలిటికల్‌ గవర్నెన్స్‌ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడు అయిన మందా సాల్మన్‌ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్యచేస్తారా? పైగా సాల్మన్‌పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికా మీరు అధికారంలోకి వచ్చింది? ఈ ఘటన ముమ్మాటికీ వైయస్సార్‌సీపీని భయపెట్టడానికి, కట్టడిచేయడానికి మీరు, మీ పార్టీవారి ద్వారా, కొంతమంది పోలీసులు ద్వారా చేస్తున్న, చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే. 

ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, మీరు అజమాయిషీ చెలాయిస్తూ,   ఊళ్లో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్లు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందలకొద్దీ వైయస్సార్‌ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి.  ఇంత జరుగుతున్నా సిగ్గులేకుండా మారణకాండను  ప్రోత్సహించారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షలకోసం శాంతిభద్రతలను దెబ్బతీసి హత్యారాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చంద్రబాబుగారూ… హింసారాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏది విత్తుతారో అదే రేపు  పండుతుందన్నది ఎప్పుడూ మరిచిపోకూడదు. టీడీపీవారి చేతిలో హత్యకు గురైన సాల్మన్‌ కుటుంబానికి వైయస్సార్‌సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుంది.