ప్రజల దృష్టిని మరల్చేందుకు బాబు కొత్త నాటకం
అమరావతి: అధికారం చాటున చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతూ ఉండటంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైయస్‌ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పీఎస్‌తో రోజుకి పదిసార్లు మాట్లాడేవాడట. ఆ కాల్ లిస్టు బయటకు తీస్తే దోపిడీ సొమ్ము సర్దుబాట్లపై మరింత సమాచారం బయటికొస్తుంది. రూ. 2వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకే ప్రజా చైతన్య యాత్ర అంటూ కొత్త నాటకం మొదలెట్టాడు' అంటూ ట్వీట్ చేశారు.
మరో ట్వీట్‌లో శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రవర్తించిన తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'కాలం చెల్లిన యనమల ఎత్తుగడలను గుడ్డిగా నమ్మిన బాబు కౌన్సిల్‌నే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట. రద్దు అనేది లాంఛనమే అని వాళ్లకి అర్థమైంది. కౌన్సిల్ పోతే మిగిలిన పదవీ కాలం జీతభత్యాలు చెల్లిస్తానన్న హామీని బాబు నిలబెట్టుకోవాలని డిమాండు చేస్తున్నారట' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.