టీడీపీ డీఎన్ఏలోనే క్రెడిట్ చోరీ ఉంది

29 Mar, 2026 19:04 IST

తాడేపల్లి: వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ సిగ్గులేని విమర్శలు చేస్తున్నారని, అసలు క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన తండ్రి చంద్రబాబే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హితవు పలికారు. టీడీపీ పెట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారు, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి పార్టీని ఎలా లాక్కున్నారు, ఆ తర్వాత ఎన్డీయేలో చేరి, ఆ తర్వాత బయటికి వచ్చి మోడీపై చంద్రబాబు చేసిన విమర్శలు లోకేష్ కు గుర్తులేవా అని అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ఇప్పటికీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పెట్టిన పథకాలకు పేర్లు మార్చి వాడుకుంటున్న చంద్రబాబుకు ఏమాత్రం రాజకీయ విలువల్లేవని మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. 
ప్రెస్ మీట్ లో మొండితోక అరుణ్ కుమార్ ఇంకేమన్నారంటే...

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై లోకేష్ క్రెడిట్ చోరీ ఆరోపణలు సిగ్గుచేటు

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవంలో నారా లోకేష్ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారిపై చేసిన క్రెడిట్ చోరీ డిజార్డర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరం. మిమల్ని కొన్ని అంశాలు సూటిగా అడగదల్చుకున్నాం. టీడీపీ గొప్పతనంపై మాట్లాడుతున్న మీరు.. పార్టీ స్థాపించినప్పుడు ఎక్కడున్నారో చెప్పాలి, చంద్రబాబు ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీ మీద పోటీ చేశారో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ మీద చంద్రబాబు పోటీ చేయలేదా ? టీడీపీ ఆవిర్భావం క్రెడిట్ లు చెప్పుకుంటున్న లోకేష్ కు అసలు తన తండ్రి చంద్రబాబుకు దాంతో సంబంధమే లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయినా అల్లుడి మీద ప్రేమతో మామ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక తన పక్కన పెట్టుకున్నారు. కానీ అదే టీడీపీకి నాదెండ్ల భాస్కర్ రావు ఓసారి, చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. టీడీపీని లాక్కుంది ఎవరు, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచింది ఎవరు, పార్టీ గుర్తును, బ్యాంక్ అకౌంట్లను, ఎన్టీఆర్ భవన్ ను లాక్కుంది ఎవరు? కానీ నారా లోకేష్ తాతగారి ఆశయాలు సాధిస్తామంటున్నారు. కానీ ఆయన నా అల్లుడు ఔరంగజేబు అని, పార్టీ లాక్కున్నారని ధర్మపీఠం మీద చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి. 

చంద్రబాబు చరిత్ర అంతా క్రెడిట్ చోరీనే

ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ మీద పోరాడిన వ్యక్తిని హత్య చేసింది చంద్రబాబు కాదా ?, ఆయన ఇప్పుడు టీడీపీ ఔన్నత్యం గురించి చెప్తుంటారు.  2024లో జనసేనతో, బీజేపీతో ఎత్తుల్లో, పొత్తుల్లో భాగంగా 57 శాతం ఓట్లు సాధించామని, 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు.. ఎప్పుడైనా మీ పార్టీ సింగిల్ గా పోటీ చేసి గెలిచిన సందర్భం ఉందా చెప్పాలి. పొత్తుల్లేకుండా పోటీ చేసిన సందర్భం ఉందా చెప్పాలి. మాట్లాడితే యునైటెడ్ ఫ్రంట్ లో ఉన్నాం, ఎన్డీయేలో ఉన్నామని చెబుతున్న చంద్రబాబు గతంలో అదే ఎన్టీయే నుంచి ఎందుకు వెనక్కి వచ్చారో, మళ్లీ ఎందుకు చేరారో చెప్పగలరా ?, ఎన్టీయే నుంచి బయటికి వచ్చిన సమయంలో చంద్రబాబు మోడీని టెర్రరిస్ట్ అనలేదా ?, మోడీకి కుటుంబమే లేదని విమర్శించలేదా ? రాజకీయ, కుటుంబ  విలువల్లేవని వ్యక్తిగత దాడులు చేయలేదా ? ఎన్డీయేలో ఉంటే ఒకలా, లేకుండా మరోలా మాట్లాడటం చంద్రబాబు రాజకీయ వ్యభిచారం కాదా?

జగన్ పథకాలు కాపీ కొడుతూ ఆయనపై విమర్శలా ?

హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చేసింది తానేనని చెప్పుకునే చంద్రబాబు.. 2004-14 మధ్య పదేళ్ల పాటు ప్రతిపక్షనేతగా  ఏం చేశారో చెప్పాలి. హైటెక్ సిటీకి శంఖుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కాదా ?, మీ మాటల్ని ఎవరు నమ్మేందుకు సిద్దంగా లేరు. టీడీపీ ఆశయాల గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, లోకేష్.. ఆ పార్టీకి వెన్నుపోటు పొడవటమే కాకుండా ఆయన పథకాలను సైతం కొనసాగించలేకపోయారో చెప్పాలి. కిలో రెండు రూపాయల బియ్యానికి, మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబే. రాజకీయాల్ని వ్యాపారం చేసింది చంద్రబాబే. ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పెట్టిన టీడీపీని చంద్రబాబు స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. మళ్లీ 2024లో దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ 4 వేలు చేశామని, తల్లికి వందనం చేశాం అని చెబుతున్న చంద్రబాబు.. ఈ పథకాలకు పునాది వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అన్న విషయం మర్చిపోతున్నారు. ఒకటో తేదీ పెన్షన్లను లబ్దిదారులకు ఇంటి వద్దే ఇవ్వాలన్న ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా, అమ్మఒడి పథకం తెచ్చింది జగన్మోహన్ రెడ్డే కదా. వీటిని కాపీ కొట్టి కూడా పూర్తిగా కొనసాగించలేకపోతున్నారు. క్రెడిట్ చోరీ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీపై అవే ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. పైకి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్న టీడీపీ వాస్తవంగా వాటిని ఎప్పుడు, ఎక్కడ ఇచ్చారో చెప్పగలరా, మీరు ఇచ్చిన ఉద్యోగాలకు ఇస్తున్న జీతాలెంతో శ్వేతపత్రం ప్రకటించాలి.

క్రెడిట్ చోరీ టీడీపీ డీఎన్ఏలోనే ఉంది

అంబేద్కర్ కు భారతరత్న అవార్డుకు, అబ్దుల్ కలాంకు రాష్ట్రపతి పదవులకు సిఫార్సు చేశామని టీడీపీ సిగ్గు లేకుండా చెప్పుకుంటోంది. మీరు సిఫార్సు చేస్తే తప్ప వారికి ఆయా అవార్డులు, పదవులు రావా, వారు అర్హులు కాదా చెప్పాలి. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వకుండా అడ్డుపడుతోంది మీరేగా, ఇదేనా మీరు ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమ ? కూటమిలో పార్టీలు వీడిపోతే  ఓడిపోతామని లోకేష్ కు భయం పట్టుకుంది. మేం కోరుకునేది కూడా అదే. మీరు కలిసి ఉండగానే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  మిమల్ని ఓడిస్తారు. దీని కోసం 2029 వరకూ వేచి చూడమని కోరుతున్నాం. మీరు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్న విషయం ప్రజలు గ్రహిస్తున్నారు. ఇన్ని లోపాలు పెట్టుకుని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై క్రెడిట్ చోరీ ఆరోపణలు చేస్తున్నారు. అదానీ గూగుల్ డేటా సెంటర్ అయిన విషయం, గ్రీన్ ఎనర్జీ హబ్, పోర్టులు,,ఫిషింగ్ హార్బర్ లు, భోగాపురం ఎయిర్ పోర్టుల్లో క్రెడిట్ చోరీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు. క్రెడిట్ చోరీ మీ డీఎన్ఏలో ఉంది. మీ డీఎన్ఏ గోత్రం వెన్నుపోటు, డీఎన్ఏ నక్షత్రం. అయినా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మొండితోక అరుణ్ కుమార్ మండిపడ్డారు.