అప్పులో ఫస్ట్ ర్యాంకు.. పాలనలో ఫెయిల్ 

21 Feb, 2026 18:01 IST

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతూ సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులపై సభ సాక్షిగా తప్పుడు సమాచారమిచ్చిన వారిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందని కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు పూర్తిగా అవాస్తవమని ఎమ్మెల్సీ కొట్టిపారేశారు. సాధారణంగా బడ్జెట్‌తో పాటు ఇచ్చే 'వాల్యూమ్ 6' బుక్‌లెట్‌లో అప్పుల పూర్తి వివరాలు ఉంటాయని, కానీ, తాము చేసే విచ్చలవిడి అప్పులు బయటపడకూడదనే ఉద్దేశంతో ఈసారి ఆ బుక్‌లెట్‌నే ప్రభుత్వం అచ్చు వేయలేదని చెప్పారు. 20 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేసిన  రూ.3.17 లక్షల కోట్ల అప్పు ఏమైందని నిలదీశారు. ఈ అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయిని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు చేసిన నీచమైన రాజకీయాలు ఇప్పుడు బయటపడ్డాయని, బూట్లు వేసుకుని స్వామివారి ఫోటో ముందు పూజ చేసిన చంద్రబాబే అసలైన అపచారానికి పాల్పడ్డారని, స్వామివారి పవిత్రతను దెబ్బ తీసినందుకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
అరుణ్ కుమార్ ఇంకా ఏమన్నారంటే..:

మండలి సాక్షిగా అబద్దాలు:
     రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉందన్నది శాసనమండలి సాక్షిగా బట్టబయలైంది. 2014-24 వరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులవివరాలు అడిగితే శాసనమండలి సాక్షిగా కూటమి ప్రభుత్వం అప్పుల మంత్రి పయ్యావుల కేశవ్ పచ్చి అబద్దాలు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయేనాటికి రూ.9.74 లక్షల కోట్ల అప్పు మిగిల్చారని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అదే సంఖ్యను మేము అడిగిన ప్రశ్నకు కూడా చెప్పారు. సభలో బడ్జెట్ పేపర్లు ఇచ్చినప్పుడు దాంతో పాటు వాల్యూమ్ 6 అనే బుక్ లెట్ ఉంటుంది. అందులో అప్పులు వివరాలు, ఎక్కడ తీసుకొచ్చాం, ఏ రంగం మీద ఎంత ఖర్చుపెట్టామనే వివరాలు అందులో ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఈ ఏడాది కూటమి ప్రభుత్వం వాళ్లు చేసే అప్పులు ఎవరికీ తెలియకూడదని ఆ వాల్యూమ్ 6 బుక్ లెట్ ను తీసేసింది. మరోవైపు యధేచ్చగా అప్పులు చేస్తున్నారు.

చంద్రబాబు అప్పుల సృష్టికర్త:
     ఎన్నికల ప్రచారంలో తాను అప్పులు చేయకుండానే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు ఊదరగొట్టాడు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేనంత విపరీతమైన అప్పులతో అప్పుల సృష్టికర్త అయ్యాడు.  తాము అధికారంలోకి వచ్చింది మొదలు, ఇప్పటి వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతో, పదే పదే అబద్ధాలు చెబుతోంది.
రాష్ట్ర  ఒకే అబద్దాన్ని పదే పదే, మళ్లీ మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనేది చంద్రబాబు నమ్మకం. అందుకే గోబెల్స్‌ ప్రచారం. అప్పుడు, ఇప్పుడు ఆయన  దాన్నే నమ్ముకున్నాడు. 

రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం గోబెల్స్‌ ప్రచారం:
రాష్ట్ర విభజన తర్వాత 2014 వరకు అన్ని రకాల అప్పులు చూస్తే రూ.1,40,717 కోట్లు కాగా, 2014-19 వరకు విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు... 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి అవి రూ.3,90,247 కోట్లకు ఎగబాకాయి. అంటే చంద్రబాబు తన హయాంలో 2014–19 మధ్య రూ.2,49,350 కోట్లు అప్పు చేశాడు. అంటే ఏటా వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్‌) 22.63 శాతంతో ఆయన అప్పు చేశారు. ఇది దేశంలోనే అత్యధిక శాతం. 
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూ.3,90,247 కోట్ల అప్పు నుంచి మేం స్టార్ట్‌ అయితే.. మేము దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.7,21,917 కోట్లు.  అంటే మా హయాంలో చేసిన అప్పు రూ.3,31,670 కోట్లు. మా ప్రభుత్వంలో అప్పుల సీఏజీఆర్‌ కేవలం 13.09 శాతమే.ఇది కాగ్‌ లెక్కలు, స్టేట్‌ గవర్నమెంట్‌ లెక్కలు, బడ్జెట్‌ డాక్యుమెంట్లలో అన్నింటిలో స్పష్టంగా కనిపిస్తుంది. మేం బడ్జెట్ తో పాటు వాల్యూమ్ 6 కూడా ఇచ్చాం. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాం చివరికి అంటే 2023–24 వరకు చూస్తే రాష్ట్ర అప్పు రూ.4,91,734 కోట్లుగా కనిపిస్తుంది. తర్వాత స్టేట్‌ గవర్నమెంట్‌ గ్యారెంటీస్‌ ఔట్‌ స్టాండింగ్స్‌ మరో రూ.1,54,797 కోట్లు.  రెండూ కలిపితే వైయస్సార్‌ సీపీ హయాం ముగిసే నాటికి ఎంత అప్పు అనేది క్లియర్‌గా ఉంటుంది. కానీ,ఇక్కడ కూడా అదే గోబెల్స్‌ ప్రచారం చేశారు. అన్ని రకాల అప్పులూ రాష్ట్రంలో మేం దిగిపోయే నాటికి రూ.7,21,917 కోట్లే కనిపిస్తుంటే.. నిన్న కూడా మాకు అప్పు రూ.9.74 లక్షల కోట్లు అప్పు మిగిల్చి పోయారు అని మళ్లీ అబద్ధాలు చెప్పారు.

20 నెలల్లో రికార్డుస్థాయిలో అప్పు:
      ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన అప్పులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లోనే  ఏకంగా రూ.3,17,448 కోట్లు అప్పు చేశారు. మేము 5 ఏళ్లలో రూ.3,31,671 కోట్ల అప్పు చేస్తే చంద్రబాబు 20 నెలల్లోనే రూ.3,17,448 కోట్ల అప్పు చేశారు. ఈ అప్పు ఏమైందో తెలియదు?. ఎంత వడ్డీ కడుతున్నారో తెలియదు? వాస్తవాలన్నీ ఆధారాలతో సహా కనిపిస్తున్నా కూడా ఇంకా వాళ్లు బడ్జెట్‌ డాక్యుమెంట్స్‌తో  గేమ్‌ ఆడుతూనే ఉంటారు. చివరికి బడ్జెట్‌ డాక్యుమెంట్లో చూస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పారదర్శకంగా చూపించడం లేదు. వాల్యూమ్ 6 ఎత్తేశారు. చేసిన అప్పుపైనా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మొన్నటి బడ్జెట్లో కూడా మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏకంగా రూ.9.74 లక్షల కోట్ల అప్పులు మేం మిగిల్చాం అని  ఆర్ధిక మంత్రి అబద్దాలు చెబుతున్నారు. ఎఫ్ ఆర్ ఎం బీ నిబంధనలను అతిక్రమించి మరీ ఈ ప్రభుత్వం అప్పులు చేస్తూ... చేసిన అప్పు ఏమైందో కనీసం ప్రజలకు వివరాలు చెప్పడం లేదు. చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. 

అప్పులపై అబద్దాలు- సభా హక్కుల ఉల్లంఘన..

శాసనమండలిలో అప్పులపై మేం అడిగిన ప్రశ్నకు  గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు సమాచారం ఇచ్చిన ఆర్థికమంత్రి, ఆయనకు అబద్దపు వివరాలు ఇచ్చిన ఆర్థికశాఖ అధికారుల మీద, సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయనున్నాం. ఎన్నికల మందు గత ప్రభుత్వ అప్పులపై తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తప్పుడు ప్రచారం చేస్తున్న వీరి తీరుపై సభాహక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయనున్నాం. మరోవైపు ప్రభుత్వం ఆన్ లైన్ బడ్జెట్ గురించి చెప్పి, ఆఫ్ లైన్ బడ్జెట్ గురించి చెప్పడం లేదు. ఆఫ్ బారోయింగ్స్ గురించి ఎందుకు మాట్లాడ్డం లేదు? రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి చేసిన అప్పులు గురించి ఎందుకు ప్రజలకు చెప్పడం లేదు? ఎందుకోసం అప్పు చేస్తున్నామన్నది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వీరికి లేదా? అప్పులు పేరుతో మీ జేబులు నింపుకుంటూ, రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని అమ్ముకుంటూ మరలా అప్పులు గురించి నీతులు చెబుతున్నారు. మరోవైపు మీరిచ్చిన హామీల అమలు గురించి, ఇస్తామన్న సంక్షేమపథకాల గురించి మాట్లాడ్డం లేదు. రూ.3.17 లక్షల కోట్లు అప్పు కేవలం 20 నెలల్లో చేసిన మీరు రానున్న మూడేళ్లలో ఇంకేన్ని లక్షల కోట్లు అప్పు చేస్తారన్న భయం ప్రజల్లో నెలకొందని అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మంత్రి పయ్యావుల కేశవ్ నోరిప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. 

అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ....
 వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ దేవుడికి అపచారం చేయలేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఫోటోలతో కూటమి నేతలు బుద్ది చెప్పాలని వేడుకున్నాం. స్వామి వారి పేరుతో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్న కూటమి నేతలకు మంచి బుద్దిని ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాం. స్వామి వారి పోటో పెట్టుకుని బూట్లుతో పూజ చేసిన చంద్రబాబు అపచారం చేశాడు. స్వామి వారి కీర్తి, పవిత్రతను దెబ్బతీసిందే చంద్రబాబు. స్వామివారి ప్రసాదంపై అత్యంత నీచమైన మాటలు మాట్లాడిందే చంద్రబాబు. కల్తీ నెయ్యి అంటూ గొడ్డు కొవ్వు అంటూ ఊగిపోయి, మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ సీబీఐ సిట్ నివేదికలో అలాంటిదేమీ లేదని తేల్చింది కదా ఇప్పుడు ఎందుకు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మెట్లు కడగడం లేదు?  చంద్రబాబు కచ్చితంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, స్వామివారికి క్షమాపణ చెప్పడంతో పాటు హెరిటేజ్, ఇందాపుర్ డెయిరీ లపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.