హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పొలిటిక్స్
నంద్యాల జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏడాది కావొస్తున్నా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పొలిటిక్స్‌కు తెర లేపారని, అందులో భాగంగానే రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను అక్రమంగా అరెస్టు చేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మండిపడ్డారు. లిక్కర్ స్కాం పేరుతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని వేధించడం సరియైన నిర్ణయం కాదని ఆయన ఖండించారు. శనివారం ఇస్సాక్‌బాషా నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. `కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేసిన పాపాన పోలేదు కానీ , సంవత్సరం నుంచి రాజకీయ కక్ష సాధింపులతో వేధింపులకు గురి చేస్తున్నారు. సూపర్ 6 హామీలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రాష్ట్రాన్ని రావణకాష్టంగా చేస్తున్నారు. ఆధారాలు లేకపోయినా సరే తప్పుడు ఫిర్యాదులతో అధికారులను, రాజకీయ నాయకులను కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు. చంద్రబాబు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు మంచి చేసిన వాడే నాయకుడు , ప్రజలను కష్టపెట్టేవాడు నాయకుడు కాదు. ఇలాగే పరిపాలన చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు` అని ఇస్సాక్‌బాషా హెచ్చరించారు.