విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి

7 Oct, 2024 19:13 IST

 విశాఖపట్నం: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ బొత​ సత్యనారాయణ అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు. ఇదే సమయంలో కూటమి సర్కార్‌ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సోమ‌వారం ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ విశాఖలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక సంక్షోభం నెలకొందని, నాలుగు నెలలు గడిచినా ప్రభుత్వం ఇప్పటికీ ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయలేకపోతోందని శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల నిర్మాణ రంగం కుదేలు కాగా, దానిపై ఆధారపడిన 25 వర్గాలవారు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బంది పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నా, వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో టన్ను ఇసుకకు రూ.370 సినరేజ్, రూ.100 హ్యాండ్లింగ్‌ ఛార్జ్, రూ.5 జీఎస్టీ.. అన్నీ కలిపి  రూ.475 చెల్లిస్తే, లారీలో ఇసుక సరఫరా చేసే వారని బొత్స గుర్తు చేశారు.


    ప్రభుత్వం ఇసుక ఉచితం అని ప్రకటిస్తున్న నేపథ్యంలో సినరేజ్‌ ఛార్జీలు రూ.3500 తగ్గించి, కనీసంగా 10 టన్నుల ఇసుక రూ.10 వేలకే సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని మండలి విపక్షనేత డిమాండ్‌ చేసారు. అక్టోబరు 15 నుంచైనా ఉచిత ఇసుకను లోపాలు లేకుండా అమలు చేయాలని కోరారు.

నిత్యావసరాల ధరలు మండుతున్నా, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఆక్షేపించారు. కిలో కందిపప్పు ధర రూ.155 నుంచి రూ.160, రిఫైండ్‌ ఆయిల్‌ లీటర్‌ రూ.130 నుంచి రూ.140, లీటర్‌ పామాయిల్‌ రూ.120, కేజీ బియ్యం ధర రూ.65కు చేరిందని ఆయన వెల్లడించారు. ప్రతి సరుకు మీద కనీసం రూ.25 నుంచి రూ.30 వరకు ధర పెరిగిందన్న ఆయన, ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దష్టి పెట్టాలని, రవాణా ఛార్జీలు భరించి, టోకు ధరకు ప్రజలకు అందించాలని కోరారు. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో తమ ప్రభుత్వం కుదరదంటే ఆ ప్రక్రియను నిలిపివేశారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్‌ భాగస్వాములు కాబట్టి, వెంటనే ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ఆ బా«ధ్యత వారిపై ఉందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్‌తో కూడినందున దాని ఔన్నత్యాన్ని కాపాడాలని తేల్చి చెప్పారు.

మరోవైపు గత మార్చిలో విశాఖ పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్‌ కంటైనర్‌ను సీబీఐ అధికారులు పట్టుకున్న విషయాన్ని గుర్తు చేసిన మండలి విపక్షనేత, ఆ కంటైనర్‌ పురంధేశ్వరి బంధువులదని అప్పట్లో ప్రచారం జరిగిందని ప్రస్తావించారు. గరుడ ఆపరేషన్‌లో భాగంగా వచ్చిన డ్రగ్స్‌ కంటైనర్‌ కేసును ఎందుకు తేల్చలేదని ప్రశ్నించిన ఆయన, డ్రగ్స్‌ పట్టుబడిన తర్వాత సీబీఐ ఏమైందని నిలదీశారు. దీనిపై సీఎం, డీజీపీతో పాటు, సీబీఐకి కూడా లేఖ రాస్తామని చెప్పారు.

 రైల్వే జోన్‌ విషయంలో గత ప్రభుత్వంలోనే భూకేటాయింపు జరిగినా, ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం చంద్రబాబు ఈసారి ఢిల్లీ పర్యటనలోనైనా రైల్వే జోన్‌ శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకుని వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా డివిజన్‌తో కూడిన  రైల్వో జోన్‌ ఉండాలన్నది తమ అభిమతమని ఆయన స్పష్టం చేశారు.