రాప్తాడు ప్రజల తరఫున సీఎంకు కృతజ్ఞతలు

22 Nov, 2021 14:26 IST

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చొరవతో వరదల్లో చిక్కుకున్న పది మంది ప్రాణాలు కాపాడగలిగామని, రాప్తాడు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. ఈనెల 19వ తేదీన అనంతపురం జిల్లా చెన్నైకొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం వద్ద చిత్రావతి నది ఉప్పొంగిన సందర్భంలో కొంతమంది యాత్రికుల కారు  వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయిందని, వారు 100కు డయల్‌ చేయగా జిల్లా పోలీస్‌ యంత్రాంగం వాళ్లను కాపాడేందుకు ఒక జేసీబీని తీసుకెళ్లారన్నారు. వరద తీవ్రతకు తట్టుకోలేక ఆ జేసీబీ కూడా కాజ్‌వే పైన చిక్కుకుందని, ఇద్దరు జేసీబీ ఆపరేటర్లు, రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఫైర్‌ సిబ్బంది, 5 మంది ప్రయాణికులు.. దాదాపు 10 మంది వరదలో చిక్కుకున్నారన్నారు. 

ఈ ఘటనకు సంబంధించి 19వ తేదీ ఉదయం 8 గంటలకు సమాచారం వస్తే.. వెంటనే సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లానని, సీఎం వెంటనే స్పందించి.. అధికారులకు ఆదేశాలిచ్చారన్నారు. విశాఖపట్నం నుంచి నేవీ హెలికాప్టర్‌ను తీసుకురావడానికి అధికారులు ప్రయత్నించారని, అనంతపురం జిల్లా బెంగళూరుకు దగ్గర కావడం వల్ల బెంగళూరు నుంచి డిఫెన్స్‌ వాళ్లతో మాట్లాడి హెలికాప్టర్‌ తెప్పించండి అని సీఎం ఆదేశాలిచ్చారన్నారు. 3 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించి.. దాదాపు 10 మందిని రక్షించుకున్నామని, వరద బాధితులను సాయం చేయడంలో.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో సీఎం తీసుకున్న చొరవ, శ్రద్ధ ప్రజల మీద సీఎంకు ఉన్న ప్రేమ, అంకితభావం తెలియజేస్తుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాప్తాడు నియోజకవర్గ ప్రజల తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.