నియంత పాలనకు ఏడాది పూర్తి
తాడేపల్లి: రాష్ట్రంలో మూడు పార్టీలను కలుపుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నియంత పాలనకు ఏడాది పూర్తయ్యిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది చంద్రబాబు పాలనలో ప్రజలకు మిగిలింది వంచన, దగా, కుట్రలు మాత్రమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి ప్రజలను దగా చేశారని, నేడు తల్లికివందనం పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా మాట తప్పారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే...
నియంత, నిరంకుశ, నిర్బంధ విధానాలకు ఏడాది చంద్రబాబు పాలన అద్దం పడుతోంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశం చూస్తే, పన్నెండు నెలల కాలంగా సాగిన వంచన, మోసం, వెన్నుపోటును రెండో ఏడాది కూడా కొనసాగిస్తానని చెప్పినట్టుగా ఉంది. ప్రజలు విసుగు చెంది నియంతపై తిరగబడితే ఆ నియంతకు ఎంత కోపం వస్తుందో ఈరోజు చంద్రబాబు ప్రసంగంలో కనిపించింది. నాలోని కోపాన్ని చూస్తారంటూ ప్రజలపై చంద్రబాబు ద్వేషంతో విరుచుకుపడిన విధానం చూస్తే నన్నెవరైనా ప్రశ్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్టుగా ఉంది. సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి కూడా ప్రశ్నించే గొంతులను ఎర్రబుక్కుతో ఏడాదిగా అణచి వేస్తున్నాడు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అడిగే స్వేచ్ఛ ప్రజలకు లేదా? ఆరు హామీలు అమలు కాలేదని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి నాలుక మందం అని మాట్లాడటం చంద్రబాబు అహంకార ధోరణికి నిదర్శనం. ఎన్నికల్లో గెలవడం కోసం విచ్చలవిడిగా పథకాల హామీలిచ్చి గెలిచాక ప్రజలు సంక్షేమ పథకాల మీద ఆధారపడకూడదని నీతులు చెప్పడం సిగ్గుచేటు.
తల్లికి వందనం పేరుతో మహిళలకు వెన్నుపోటు
చంద్రబాబు తల్లికి వందనం పథకాన్ని తల్లికి వంచనగా మార్చేశారు. ప్రతి బిడ్డకూ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి మా హయాంలో ఎంతమందికి ఇచ్చామో అంతమందికే ఇస్తూ, గతం కన్నా ఎక్కువ అంటూ అబద్దాలు చెబుతున్నారు. పైగా గతేడాది ఈ పథకాన్ని అమలు చేసిన పాపానపోలేదు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ) రికార్డుల ప్రకారం 87,41,885 మంది తల్లులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయాలంటే రూ.13,050 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 67.27 లక్షల మంది తల్లులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తూ రూ. 8,745 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. కేవలం తల్లికి వందనం పథకంలోనే దాదాపు రూ. 5 వేల కోట్ల వరకు ఎగనామం పెట్టారు. రెండేళ్లకు కలిపి ఈ ఒక్క తల్లికి వందనం పథకానికే రూ. 26 వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం రూ. 8,745 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. ఎడ్యుకేషన్ ఎకో సిస్టం అభివృద్ధి చేయడం కోసం అమ్మ ఒడి పథకంలో రూ. 2 వేలు తగ్గించి తల్లుల అకౌంట్‌లో జమ చేస్తే, అమ్మ ఒడి అర్ధ ఒడిగా మారిందని ఆరోజు నారా లోకేష్ అవహేళన చేశాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా రూ. 2వేలు కట్ చేసి ఇస్తోంది. ఇప్పుడు వీళ్లని ఏమనాలి.
పథకాలను అమలు చేసే ఆలోచన లేదు
ఆడబిడ్డ నిధి పథకానికి ఏడాదికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి ఉంటే దాన్ని గతేడాది అమలు చేయలేదు. ఈ ఏడాది కూడా అమలు చేయడం లేదు. ఇదేనా మహిళల మీద గౌరవం ఉండటం అంటే. దీపం పథకం లబ్ధిదారులను సగానికి సగం తగ్గించేసి అరకొరగా అమలు చేశారు. ఉచిత బస్సు ఇంకా ఊహల్లోనే ఉంది. నిరుద్యోగ భృతికి మోక్షం కలగడం లేదు. వైయస్ జగన్ సీఎంగా ఉండగా వైయస్సార్ చేయూత కింద రూ. 19,189 కోట్లు, వైయస్సార్ కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు చెల్లించడంతోపాటు ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపించారు. వైయస్సార్ ఈబీసీ నేస్తం రూ.1,876 కోట్లు మహిళల ఖాతాల్లో జమ చేశాం. ఈ పథకాలన్నింటినీ చంద్రబాబు రద్దు చేసి మహిళలను వంచించాడు. ఇది మోసం కాదా? ఎవరి నాలుక మందమో చంద్రబాబు చెప్పాలి. ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రణాళిక లేని పీ4కి అనుసంధానం పేరుతో ఎత్తేసే కుట్రకు చంద్రబాబు తెరదీశాడు. కూటమి ప్రభుత్వంలో ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా 4 లక్షల ఉద్యోగాలు పీకేశారు. నెలనెలా జీఎస్టీ వసూళ్లు చూస్తే చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎంత అధోగతిలో ఉందో అర్థమవుతుంది. వైయస్ జగన్ తొలిఏడాదిలోనే 1.36 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చి చరిత్రలో నిలిచిపోయారు. తొలి ఏడాది వైయస్ జగన్ పాలనకు, ఈ ఏడాది చంద్రబాబు పాలనకు పోల్చి చూస్తే.. చంద్రబాబు ఎంత అసమర్థుడో అర్థమవుతుంది.
ఉద్దేశపూర్వకంగానే వైయస్ జగన్ భద్రత కుదింపు
గడిచిన ఏడాది పాలనలో దళితుల మీద దాడులు చేయడం తప్ప, ఒరగబెట్టిందేమీ లేదు. దళిత విద్యార్థులను రౌడీషీటర్లుగా ప్రమోట్ చేస్తున్నాడు. బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పరామర్శిస్తే చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదు. రాష్ట్రాన్ని రాజకీయ ఖైదీలకు ఆవాసంగా మార్చేశారు. ఏడాది కాలంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన వైయస్సార్సీపీ నాయకులను జైళ్లకు పంపుతూ కక్షతీర్చుకుంటున్నాడు. ఇంతకన్నా ఇంకేం చేయగలడు? శవాల దిబ్బగా రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాడా? ఏడాది చంద్రబాబు పాలనపై వచ్చిన ప్రజాగ్రహానికి నిన్నటి జగన్ పొదిలి పర్యటనే సాక్ష్యం. పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుందామని ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వెళితే రైతులు పోటెత్తారు. ఆయనకొచ్చిన జనాదరణ చూసి తట్టుకోలేని చంద్రబాబు, రైతులను ఉద్దేశించి రౌడీలంటూ పేట్రేగి మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులన్నా, మహిళలన్నా, విద్యార్థులన్నా గౌరవం లేదు. బాధ్యత అంతకన్నా లేదు. వ్యవసాయం పేరెత్తితేనే చంద్రబాబుకి నచ్చదు. ప్రతిపక్ష నాయకుడి పర్యటనలకి ఉద్దేశపూర్వకంగానే కనీస భద్రత కూడా కల్పించడం లేదు. వైయస్ జగన్ కాన్వాయ్ వెళ్తుంటే రాళ్లదాడితో రెచ్చగొట్టారు. నిరసనకారులకు పోలీసులు అండగా నిలబడ్డారు. టీడీపీ చేయించిన రాళ్ల దాడిలో నా నియోజకవర్గం యర్రగొండపాలెం పెదకొమ్ములాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డికి గాయాలయ్యాయి. టీడీపీ నాయకులే దాడులు చేయించి మాపై అక్రమ కేసులు పెడుతున్నారు. దిగజారుడు రాజకీయాలతో రాష్ట్ర ప్రతిష్టను రోజురోజుకీ మసకబారుస్తున్నారు. నిత్యం ఏదో ఒక అలజడి సృష్టించి డైవర్షన్ రాజకీయాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు తప్ప ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.