సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
తాడేపల్లి: టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్‌ఓ) సతీష్‌కుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని, పరకామణి చోరీ కేసులో వైయస్ఆర్‌సీపీ నాయకుల పేర్లు చెప్పాలని ఆయన్ను మానసికంగా వేధించి చనిపోయేలా ప్రేరేపించారని ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సతీష్‌కుమార్ కేవలం ప్రభుత్వ వేధింపులతోనే మరణిస్తే, దాన్ని హత్యగా ప్రచారం చేస్తూ, వైయస్ఆర్‌సీపీ నేతలను నిందిస్తున్నారని ఆక్షేపించారు.
ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏం మాట్లాడారంటే..:
వీటన్నింటికీ సమాధానం ఉందా?:
టీటీడీ మాజీ ఎవీఎస్‌ఓ మరణం వెనక ఎన్నెన్నో సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గురువారం సా. 7 గం.కు ఇంటి నుంచి బయల్దేరిన వ్యక్తి అర్ధరాత్రి 12 గం.కు రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. మరి మధ్యలో 5 గంటల్లో ఏం జరిగింది? అర్థరాత్రి దాదాపు 12.30 గం.కు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన సీఐ సతీష్‌కుమార్, గంట తర్వాత తాడిపత్రికి సమీపంలో శవమై కనిపించాడు. ఈ గంటపాటు ఏం జరిగిందో విచారణ చేయలేదు. అయినా వీపుపై గొడ్డలితో నరికినట్టు వైద్యుల ధ్రువీకరించారంటూ ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
ఒక ఏసీ బోగీలో ఉన్న ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపుతుంటే టీసీ కానీ, తోటి ప్రయాణికులు కానీ అడ్డుకోలేదా? కనీసం చూడలేదా?. ఎక్కడ ఆయన మరణం ప్రభుత్వానికి చుట్టుకుంటుందోనన్న భయంతోనే హత్య పేరుతో ఒక కట్టుకథను ప్రచారంలోకి తెచ్చారు. హడావిడిగా పోస్టుమార్టమ్ చేశారు. ఆయన భార్య ఫోన్ తీసుకున్నారు. ఆమెతో ఎవరూ మాట్లాడకుండా కట్టడి చేస్తున్నారు. ఇదంతా ఎందుకు?
చంద్రబాబుది మాఫియా ప్రభుత్వం:
నేరాలపై ఫిర్యాదు చేసిన వారినే నేరస్తులుగా చిత్రీకరిస్తూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఒక మాఫియా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఎంతోమంది నిజాయితీతో పనిచేసిన అధికారుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుకుంటోంది. దేశంలో ఎక్కడా ఇలాంటి పాలన ఉండదు.
జత్వానీ కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులు గారిని 50 రోజులపాటు జైల్లో అక్రమంగా నిర్బంధించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన జేఎస్‌డబ్ల్యూ కంపెనీ యజమానిని హనీట్రాప్ చేసి వేధించాలని చూసిన జత్వానీ అనే కిలాడీ బారి నుంచి కాపాడటం ఆయన చేసిన నేరమా? మార్గదర్శి చిట్‌ఫండ్ స్కామ్‌ని వెలికితీసినందుకు అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ 80 రోజులకుపైగా జైల్లో ఉన్నారు. రఘురామకృష్ణంరాజు కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న విజయపాల్‌ని 78 రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ నడుపుతున్నామని చెప్పుకుంటూ ట్రబుల్ ఇంజిన్ సర్కార్‌ని నడిపిస్తున్నారు. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిలువైల్లా ద్వేషంతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు.
మరోవైపు వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రభుత్వ సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మట్టి, ఇసుక, బూడిద, మద్యం, మైనింగ్ పేరుతో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు కప్పం కట్టకపోతే ఏ వ్యాపారం సాగనివ్వడం లేదు. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటే ప్రభుత్వాన్ని ఊదేస్తుందన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాటలని చంద్రబాబు ఎప్పుడో గుర్తించాడు. అందుకే నోరెత్తితే మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు.
ఆధారాలే లేకుండా హత్య అని టీడీపీ ప్రచారం:
టీటీడీ మాజీ ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్ తాడిపత్రి చేరువలో కోమలి వద్ద రైలు పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించారు. పరకామణి చోరీ వ్యవహారంలో లోక్‌అదాలత్‌లో కేసు రాజీ చేసుకోవడమే నేరమన్నట్టు సిట్ అధికారులు విచారణ పేరుతో సతీశ్‌కుమార్‌ను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ కేసులో వైయస్ఆర్‌సీపీనాయకులను అక్రమంగా ఇరికించడమే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం అందుకనుగుణంగా నాయకుల పేర్లు చెప్పమని వేధించారు.
ఈనెల 6న విచారణకు హాజరైన సతీశ్‌కుమార్ పక్కన ఒక రౌడీషీటర్‌ను కూర్చోబెట్టి మరీ విచారించారంటే వైయస్ఆర్‌సీపీ నాయకుల పట్ల ఈ ప్రభుత్వం ఎంత పగపెంచుకుందో అర్థమవుతుంది. ఎంతోమంది ఉన్నతస్థానాల్లో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను వేధించి పోస్టింగ్ లు ఇవ్వకుండా ఏడాదిన్నరగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. అలాంటిది సీఐ స్థాయిలో ఉన్న సతీశ్ కుమార్ ఈ వేధింపులను, సిట్ చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఈనెల 14న మరోసారి విచారణకు హాజరుకావాల్సి ఉండగా రైల్లో వెళ్తుండగా అనుమానాస్పద స్థితిలో చనిపోతే, ఆయన్ను హత్య చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు.
సతీశ్‌కుమార్‌ని అడ్డం పెట్టుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులను పరకామణి కేసులో ఇరికించాలన్న కుట్ర విఫలం కావడంతో హత్య పేరుతో ఈ కొత్త కట్టుకథను రచించి ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. లిక్కర్ కేసులో వైయస్ఆర్‌సీపీ నాయకులను అక్రమంగా జైలుకు పంపినట్టుగానే సతీశ్ కుమార్ మరణంపైనా కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు.
పార్టీ కార్యాలయంపై దాడి హేయం:
వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద దాడులు, అక్రమ కేసుల నుంచి చివరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద దాడుల వరకు పరిస్థితి వచ్చింది. హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించారు. సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. ఎవరెంత రెచ్చిపోయినావైయస్ఆర్‌సీపీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని అణచలేరు.
పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్:
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. కూటమి నాయకులంతా దోచుకునే పనిలో నిమగ్నమైపోయారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పీఏ సురేశ్, ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మధ్య తగాదాతో రూ.350 కోట్ల విలువైన భూదోపిడీ వ్యవహారం వెలుగుచూసింది. విశాఖలో తెలుగుదేశం పార్టీ నాయకుడికి చెందిన కోల్డ్ స్టోరేజ్‌లో 189 టన్నుల గోమాంసం నిల్వలు డీఆర్‌ఐ అధికారులు పట్టుకుంటే, సనాతన ధర్మ పరిరక్షకుడిగా ప్రచారం చేసుకునే పవన్ కళ్యాణ్‌కి చీమకుట్టినట్టు కూడా లేదు.
పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద నోరుపారేసుకున్న చంద్రబాబుకి.. పవన్‌కళ్యాణ్, నారా లోకేశ్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ చేస్తున్న జల్సాలు కనిపించడం లేదా? మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమ ఆస్తులంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే, గంటల్లోనే అధికారులు పవన్‌కళ్యాణ్ గాలి తీసేశారు. ఇదే పవన్ కళ్యాణ్‌కి చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట అక్రమ కట్టడం కనిపించలేదా? అటవీ సంపదను పరిరక్షిస్తానని చెప్పుకునే పవన్‌కళ్యాణ్ నా నియోజకవర్గంలోని గంజివారిపల్లె అటవీ రేంజ్‌లో గుప్తనిధుల కోసం జేసీబీలను తీసుకెళ్లి విపరీతంగా తవ్వకాలు చేస్తున్నారని చెప్పినా పట్టించుకున్న పాపానపోలేదు. వీటన్నింటి నుంచి దృష్టి మళ్లించడం కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి దుష్ప్రచారం చేస్తూ, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వివరించారు.