ఏపీని ఫ్రీ క్యాన్సర్ స్టేట్‌గా మార్చడమే సీఎం వైయస్ జగన్ లక్ష్యం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఫ్రీ క్యాన్సర్ స్టేట్‌గా మార్చడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పేర్కొన్నారు. వరల్డ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడలో 3కే వాకథాన్ నిర్వహించారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు క్యాన్సర్ బారిన పడే సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మహిళలు పడే బాధలు చాలా దురదృష్టకరం. మహిళలు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధి ముదిరిపోయిన తరువాత ఎవరూ కూడా ఏమీ చేయలేరు. ముందే జాగ్రత్తలు తీసుకోగలిగితే ఆ వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కోటీశ్వరుడినైనా, పేదవాడినైనా ఈ క్యాన్సర్ ఒకే విధంగా చంపేస్తోంది. సక్రమమైన సమయంలో వైద్యం తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. క్యాన్సర్ నుంచి బయటపడేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్‌పై మహిళలు అవగాహన కలిగి ఉండాలని రోజా సూచించారు.