ఆ పార్టీలను తరిమికొట్టే రోజొచ్చింది.. చిత్తుగా ఓడించండి
వైయస్‌ఆర్ జిల్లా: బద్వేలు ప్రజల దెబ్బ కాంగ్రెస్, బీజేపీలకు అబ్బ అనిపించేలా ఉండాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్, విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న బీజేపీలు.. బద్వేలులో మాత్రం తలరాతలు మారుస్తామంటున్న దొంగ పార్టీలను తరిమికొట్టే అవకాశం వచ్చిందని, వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని బద్వేలు ఓటర్లను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో నిలబడాలంటే బీజేపీ, కాంగ్రెస్‌కు వెన్నులో వణుకుపుట్టేలా ప్రజలు తీర్పు ఇవ్వాలన్నారు. బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొని మాట్లాడారు.
తెలుగుదేశం, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి వైయస్‌ఆర్ సీపీని దొంగ దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ దొంగలు ఎవరో ప్రజలందరికీ తెలుసని, వారు ఆడుతున్న వెన్నుపోటు రాజకీయాలకు ముగింపు పలకాలంటే.. బద్వేలు ప్రజలు ప్రతి ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి లక్షకు పైగా మెజార్టీ అందించి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లుపట్టుకుంటే.. ఛీ పొమ్మంటే గల్లీ బీజేపీ నేతల దగ్గరకు వచ్చిచేరాడని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. గల్లీ బీజేపీ నేతలను ప్రసన్నం చేసుకొని ఢిల్లీకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు.
పొలిటికల్ సూపర్ స్టార్ సీఎం వైయస్ జగన్ నిలబెట్టిన అభ్యర్థి డాక్టర్ సుధను బంపర్ మెజార్టీతో గెలిపించి.. ఢిల్లీ నాయకులు మన రాష్ట్రంవైపు, జగనన్న వైపు తిరిగి చూసేలా తీర్పు ఇవ్వాలని బద్వేలు ప్రజానీకాన్ని కోరారు. బీజేపీ ముఖ్యమంత్రులు 18 రాష్ట్రాల్లో ఉన్నారని, ఆ రాష్ట్రాల్లో అమ్మఒడి, వైయస్‌ఆర్ చేయూత, ఆసరా వంటి కార్యక్రమాలు అమలు చేశారా..? అని బీజేపీలను ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన అడ్డదారిలో వచ్చినా.. దొడ్డిదారిలో వచ్చినా డిపాజిట్లు రాకుండా చేయాలన్నారు. భర్త వెంకట సుబ్బయ్య అడుగు జాడల్లో డాక్టర్ సుధ బద్వేలును అభివృద్ధి వైపు నడిపించాలనుకుంటున్నారని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశీస్సులతో ప్రజలకు సేవ చేయాలనే గొప్ప మనసుతో మీ ముందుకు వచ్చిన ఆడపడుచును ఆశీర్వదించాలని బద్వేలు ఓటర్లను ఎమ్మెల్యే రోజా కోరారు.