ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తామని చెప్పాలనుకుంటున్నారా?  

18 Nov, 2025 15:23 IST

తాడేపల్లి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్‌ చేస్తామని చెప్పాలనుకుంటున్నారా? అని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ సూటిగా ప్ర‌శ్నించారు.  వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి కారుమూరి వెంక‌ట‌రెడ్డి అక్ర‌మ అరెస్టును ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ఏం మాట్లాడారంటే..:

వెంకటరెడ్డి అరెస్ట్‌ దుర్మార్గం:
    రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అప్రజాస్వామిక విధానాలను ఎత్తి చూపడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమాలు, అవినీతి, దారుణాలు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తున్నందుకే వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఈ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్ట్‌ చేసింది. పరకామణి చోరీ కేసులో సాక్షిగా ఉన్న టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ విచారణకు వస్తుండగా అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్రమైన విషయం. సాక్షిని కాపాడుకోలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు. సతీష్‌కుమార్‌ మృతిపై కుటుంబ సభ్యులతో పాటు ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి. దానిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 
    కానీ బాధ్యత మరిచి ఆధారాలు లేకుండా హత్య అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తే వారిని వదిలేసి, నిజాలు చెప్పాలని డిమాండ్‌ చేసిన వెంకటరెడ్డిని అరెస్ట్‌ చేయడం దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో, యూట్యూబ్‌ ఛానెళ్ల మీద ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. శవ పంచనామా కూడా జరగకుండానే హత్య అని ప్రచారం చేసిన టీడీపీ అనుకూల మీడియాని వదిలేసి ప్రభుత్వ నిర్లక్ష్యంపై గొంతెత్తిన వెంకటరెడ్డిని అరెస్ట్‌ చేశారు.
    ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యంగా ఇలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరు గొంతెత్తినా అరెస్ట్‌ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పాలనుకుంటోందా?. 

నిష్పక్షపాతంగా విచారణ చేయమంటే దేనికి భయం?:
    సతీష్‌కుమార్‌ను గొడ్డలితో నరికినట్టు ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తే అది పోలీసులకు తప్పుగా కనిపించకోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఈ ప్రభుత్వం నేరంగా పరిగణించడం చూస్తుంటే చట్టాలను అమలు చేయడంలో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో అర్థమైపోతుంది. నిందితులను వదిలేసి, బాధితులపై కేసులు నమోదు చేసి వేధిస్తున్న దారుణమైన పరిస్ధితులు రాష్ట్రంలో అడుగడుగునా కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని సంబంధం లేని వ్యక్తులతో ఫిర్యాదులు చేయించి అక్రమంగా అరెస్టులు చేసి వేధిస్తున్నారు. 
    పరకామణి చోరీ కేసులో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను అక్రమంగా ఇరికించడమే ధ్యేయంగా విచారణ పేరుతో టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ను సిట్‌ అధికారులే బెదిరించారంటే రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నా. వాస్తవాలను చెప్పాలని ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు బెదిరిపోతుందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ నిలదీశారు.