కాగితాలపై కాకి లెక్కలు.. అరచేతిలో వైకుంఠం
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ కాగితాలపై కాకి లెక్కలు వేసినట్టే ఉందని, రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేశారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అయితే ఎన్ని చేసినా వాస్తవాలు దాచలేకపోయారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గుర్తు చేశారు.
ప్రెస్‌మీట్‌లో తాటిపత్రి చంద్రశేఖర్ ఏమన్నారంటే..:
- అప్పులు ఆకాశంలో..ఆదాయం పాతాళంలో..
గత ఏడాది అంకెలనే స్వల్ప మార్పులతో పెంచి రూ.10 వేల కోట్లు అధికంగా ఈ బడ్జెట్‌లో చూపించారు. బడ్జెట్ పరిమాణం పెరిగిందని చెబుతున్నప్పటికీ, అది ఆదాయ వృద్ధి వల్ల కాదని, అప్పుల ద్వారానే పెరిగిందని స్పష్టమవుతోంది. “అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఆదాయం పాతాళంలో ఉంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. గత రెండు బడ్జెట్లలో కాగితాలపై కాకి లెక్కలు వేసినట్లే, ఈసారి కూడా గత ఏడాది అంకెలనే అటు ఇటు మార్చి రూ.10 వేల కోట్లు పెంచి చూపించారు.
గత సంవత్సరం రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిజంగా సంపద సృష్టి జరిగితే ఈసారి ఆదాయం పెరగాలి కదా? కానీ పెరిగింది అప్పులే. ఈ ఏడాది తీసుకునే అప్పులకు అదనంగా మరో రూ.10 వేల కోట్లు అప్పు తీసుకుంటామని చెప్పి బడ్జెట్‌ను మాయ చేశారు.
- ఏ వర్గానికీ న్యాయం చేయలేదు
ఈ మూడో బడ్జెట్‌లో ఏ వర్గానికీ న్యాయం చేయలేదు. ఆడబిడ్డ నిధి ఎత్తేశారు. నిరుద్యోగ భృతికి కేటాయింపులు సున్నా. 50 ఏళ్లకే పింఛన్ పథకం ఊసే లేదు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు సరైన కేటాయింపులు లేవు. విద్యా రంగంలో టోఫెల్, సీబీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌లపై కూడా స్పష్టత లేదు.
- ద్రవ్యలోటులో దేశంలోనే ఏపీ టాప్
గత బడ్జెట్‌లో మూలధన వ్యయం రూ.40,635 కోట్లు అన్నారు. తరువాత సవరించి రూ.33,134 కోట్లు చేశారు. కానీ 9 నెలల్లో కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.48 వేల కోట్లు చేస్తామని ఎలా చెబుతున్నారు? రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేని ప్రభుత్వం రూ.48 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తుంది?
ద్రవ్యలోటులో దేశంలో ఏపీ టాప్‌లో ఉంది. ఆదాయం 3 శాతం లోపే, అప్పులు 30 శాతం పైనే ఉన్నాయి. రైతులు, విద్య, పరిశ్రమలకు సరైన ప్రోత్సాహం లేదు. నాడు–నేడుకు రూ.500 కోట్లు కేటాయించి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. 2047కు స్వర్ణాంధ్ర అంటున్నారు. కానీ ఆదాయ మార్గాలు ఎక్కడ? ఈ బడ్జెట్‌లో మాటలు ఎక్కువ, కేటాయింపులు తక్కువ. తల్లికి వందనం, పంటసాయం..ఇలా అన్నీ అరకొరే. కొత్త పెన్షన్లు ఒక్కటీ లేవు. రైతుల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
- రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది చంద్రబాబే
ఈ బడ్జెట్‌లో ఆదాయం కనిపించలేదు, ఆదాయ మార్గాలు చూపించలేదు. కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఉనికి లేదు. రోజు రోజుకు పన్నేతర ఆదాయం తగ్గిపోతోంది. ఎటుచూసినా కూడా అప్పులు కుప్పగా కనిపిస్తున్నాయి. రూ.3.12 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రతి విషయం మీద గత ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు. కరోనా వంటి సంక్షోభంలో కూడా మా ప్రభుత్వం ఏ ఒక్క సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాలు ఆపలేదు.
- సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులే లేవు
బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అవుతుందో చంద్రబాబే చెప్పాలి. అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తాం, చూస్తామంటూ మళ్లీ మోసం, దగా చేస్తున్నారు.
ఇవాళ లోటు బడ్జెట్
1995లో రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉండేది. ఇవాళ లోటు బడ్జెట్‌లో ఉంది. మా ప్రభుత్వ కాలంలో జీఎస్డీపీ 12.43 శాతం సాధించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ముందంజలో నిలిచాం. నాలుగు పోర్టులు నిర్మించాం. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీలేక ఆదానీ డేటా సెంటర్‌ను గూగుల్ డేటా సెంటర్‌గా ప్రచారం చేస్తున్నారు. పేదవారు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇస్తామని చెప్పి అమలు చేయలేదు. డ్వాక్రా రుణాలు, సున్నా వడ్డీ లేదు. దీపం పథకంలో కూడా మోసం చేస్తున్నారు.
పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?
కాపులకు కేటాయింపులు లేకపోయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు. మాజీ మంత్రి ఇల్లు ధ్వంసం చేసినా స్పందించలేదు. టీడీపీకేమో కాసులు, వైయస్ఆర్‌సీపీకేమో కేసులు అన్నదే లోకేష్ ధోరణి. మార్కాపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. వెలిగొండ ప్రాజెక్ట్‌లో అవినీతిని బయటపెడతాం. ఇకనైనా కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలతో ప్రజల ముందుకు రావాలి.
చంద్రబాబుకు ఇదే చివరి అవకాశం. మరోసారి ప్రజలు అవకాశం ఇవ్వరు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో బహిరంగ క్షమాపణ చెప్పాలి” అని ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.