రైతులకు ఎరువుల కొరత రానివ్వం
నెల్లూరు: రైతాంగానికి లోటు రానివ్వకుండా అవసరమైన ఎరువులను ఎప్పటికప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా, అగ్రికల్చర్ సొసైటీల ద్వారా అందజేస్తున్నామని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం ఈదులవారిపాళెం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. రైతు భరోసా కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలు, ఎరువుల సరఫరా తదితర అంశాలపై స్థానిక రైతులు, అధికారులతో ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం రైతులకు అవసరమైన ఎరువులను పంపిణీ చేశారు. సీఎం వైయస్ జగన్ గారు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడుతున్నారని తెలిపారు. సబ్సిడీ విత్తనాల పంపిణీ, సమగ్రంగా, సంపూర్ణంగా సాగునీరు అందించడంతో పాటు, రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయడం పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. అనంతరం బ్రహ్మదేవం గ్రామంలో వెలసిన కైలాసనాధ స్వామి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవానికి ఎమ్మెల్యే కాకాణి హాజరయ్యారు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే దేవాలయ భూములకు విముక్తి కల్పించి, అవకతవకలకు ఆస్కారం లేకుండా, పారదర్శకంగా వేలంపాటలు నిర్వహించి, రాబట్టిన నిధులను దేవాలయాల ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో నూతన దేవాలయాలు నిర్మించడంతో పాటు, పురాతన దేవాలయాల పునరుద్ధరణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.