ధాన్యం అమ్మిన 15 రోజుల్లోనే రైతు ఖాతాల్లో డబ్బు
శ్రీకాకుళం: ధాన్యం విక్రయించిన 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నట్లు వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య తీవ్రతను ఫోన్ లో సీఎం వైయస్ జగన్ దృష్టికి ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తీసుకెళ్లారు. ధాన్యం అమ్మి 20 రోజులు గడిచిన రైతుల అకౌంట్ లో డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ధర్మాన సీఎం వైయస్ జగన్‌కు వివరించడంతో ముఖ్యమంత్రి స్పందించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజుల్లో తప్పనిసరిగా చెల్లింపు జరగాలని, వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై ధర్మాన హర్షం వ్యక్తం చేస్తూ.. రైతులు అందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.