వ్యవసాయ కూలీలకు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పరామర్శ
కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం పుట్టుకలమర్రి గ్రామ సమీపంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనం బోల్తా పడిన ఘటనలో 46 మంది గాయపడిన విషయం తెలిసిన వెంటనే ఆలూరు ఎమ్మెల్యే బూనేసి విరూపాక్షి హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. అవసరమైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందించాలని సూచించారు. ఇప్పటికే కర్నూలులో ఉన్న వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ ప్రత్యేకంగా ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే, ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, ఉపాధి కోసం పక్క గ్రామాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వైయస్ఆర్‌సీపీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, వ్యక్తిగతంగా తాను కూడా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.