అధికారం ఎవరికి శాశ్వతం కాదు
ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడులు, అనంతరం నమోదైన కేసుల విషయంలో ప్రభుత్వం తీరును ప్రశ్నించారు. రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదని కూటమి నేతలు గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అంబటి రాంబాబు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నాయకుడని పేర్కొన్న ఆయన, వైయస్ జగన్‌పై దుష్ప్రచారం చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదాస్పద ఫ్లెక్సీలు తొలగించాలని కోరారు. కావాలనే టీడీపీ కార్యకర్తలు అంబటి కారుపై దాడికి దిగారని ఆరోపించిన శివప్రసాదరెడ్డి, అనంతరం జరిగిన పరిణామాలను కక్షపూరిత చర్యలుగా అభివర్ణించారు. అంబటి అనుకోకుండా మాట్లాడిన మాటలను పెద్దది చేసి, ఆయన ఇల్లు, కార్యాలయంపై దాడులు చేయడం అన్యాయమన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నప్పుడు మహిళా హోంమంత్రి ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, కొత్త విధమైన హింసాత్మక సంస్కృతిని తీసుకురావద్దని హెచ్చరించారు.
ఒకే సంఘటనపై 36 కేసులు నమోదు చేయడం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దాడి చేసినవారు బయట స్వేచ్ఛగా తిరుగుతుంటే, దాడికి గురైన అంబటి జైలులో ఉండటం న్యాయసమ్మతమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలు ఆపాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.