వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
అనంతపురం : శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో వాహనం వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపిన మేరకు.. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి బుధవారం రాత్రి అనంతపురం శివారులోని సోములదొడ్డి వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.
ఎమ్మెల్యే వాహనం సోములదొడ్డి వద్ద నేషనల్ హైవే మీదకు మళ్లిన వెంటనే వెనుక వైపు నుంచి ఫోర్డ్ ఫిగో కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎమ్మెల్యేకు ఎటువంటి ఆపద తలెత్తలేదు. ప్రమాదంలో రెండు కారులూ దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే వాహనంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు డ్రైవర్, గన్‌మెన్ ఉన్నారు. ఫోర్డ్ ఫిగో వాహనంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ఫిగో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. అయితే అందులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.