ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం అండగా ఉంది
ఏలూరు: అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. అస్వస్థతకు గురైన బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారని, డిశ్చార్జ్ అయినవారిని కూడా నెల రోజుల పాటు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారన్నారు. మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. డిశ్చార్జ్ అయిన వారికి విటమిన్లు, పోషకాహారం అందించాలని వైద్యులకు సీఎం సూచించారన్నారు. సీఎం వైయస్ జగన్ సూచన మేరకు కేంద్రం నుంచి న్యూట్రీషియన్, వైరల్ ఇలా నాలుగైదు రకాల అంశాలపై పరిశోధన చేయడానికి కేంద్ర బృందాలు వస్తున్నాయని చెప్పారు.
ఇప్పటి వరకు పాలు, నీరు టెస్టు చేశారని, ఏలూరు మున్సిపాలిటీ కాకుండా.. అర్బన్, దెందులూరు వంటి ప్రాంతాల్లో కూడా కేసులు వచ్చాయని చెప్పారు. అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏదీ తేలికగా తీసుకోవద్దని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య విధాన పరిషత్ కమిషనర్, హెల్త్ సెక్రటరీ గంట గంటకు పరిస్థితిని సమీక్షిస్తూ.. సీఎం ఆఫీస్కు సమాచారం ఇవ్వాలని సూచించారన్నారు. ఇంకా కావాలంటే ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా డాక్టర్లను పిలిపించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్ని నాని చెప్పారు.