ఎన్నిక ఏదైనా విజయం వైయస్‌ఆర్ సీపీదే
చిత్తూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్ సీపీ వ్యవహారాల ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా.. చంద్రబాబు తీరు ఉందని మండిపడ్డారు. ఈనెల 14వ తేదీన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. ఈ మేరకు రేణిగుంటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం వైయస్ జగన్ సభా మైదానాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా విజయం వైయస్‌ఆర్ సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు రౌడీ రాజ్యం నడిపాడు కాబట్టి.. ఇంకా ఆ భ్రమలోనే ఉండి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్ సీపీది రౌడీ రాజ్యం అయితే సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున నీరాజనాలు పలుకుతారా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. సీఎం వైయస్ జగన్ ప్రజారంజక పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. రౌడీ రాజ్యం అయితే ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్లు వేస్తారా..? పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్నట్టు.. టీడీపీ హయాంలో రౌడీ రాజ్యం నడిపాడు కదా ఇంకా అదే భ్రమలో చంద్రబాబు ఉన్నాడన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనను మెచ్చుకొని ఏ విధంగా తీర్పు ఇవ్వాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఉప ఎన్నికలో కూడా వైయస్‌ఆర్ సీపీకి అనూహ్య మెజార్టీ వస్తుందన్నారు.