దేవుడి ఆలయాన్ని సర్కస్‌ కంపెనీ అంటారా..?

22 Dec, 2021 10:55 IST

విజయనగరం: రామతీర్థం బోడికొండపై టీడీపీ నేత అశోక్‌గజపతిరాజు వీరంగం సృష్టించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కోదండ రామాలయ నిర్మాణ శిలాఫలకంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేరు ఉండటాన్ని ఓర్వలేక శిలాఫలకం బోర్డును అశోక్‌గజపతిరాజు పీకిపారేశారు. ఈ మేరకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందిస్తూ..

‘దేవుడి ఆలయాన్ని అశోక్‌ గజపతి సర్కస్‌ కంపెనీ అంటారా..? మీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి అయినా ఆలయం కోసం కేటాయించారా..? విగ్రహ ధ్వంసంలో అశోక్‌గజపతి హస్తం ఉందేమోనని అనుమానం కలుగుతుంది. 2, 3 నెలల్లో ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాం. ఆలయ అభివృద్ధికి నిధులు కూడా కేటాయించాం. అశోక్‌ గజపతిరాజు ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా..? వయసు తగ్గట్టుగా అశోక్‌ గజపతిరాజు ప్రవర్తించాలి. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్టు అశోక్‌ గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. అభివృద్ధికి సహకరించకపోయినా పర్వాలేదు కానీ, అడ్డుపడొద్దు. ఆలయ అభివృద్ధికి అడ్డుపడితే శ్రీరాముడు కూడా వీరిని క్షమించడు’ అని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు.