ప్రజలంతా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి
7 Apr, 2020 12:24 IST
పశ్చిమగోదావరి: లాక్‌డౌన్ పూర్తి అయ్యే వరకు ప్రజలంతా స్వీయ గృహ నిర్భంధంలోనే ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు సూచించారు. పెనుగొండలో మరో పాజిటివ్ కేసు నమోదుకావడంతో అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. జిల్లాలోని పెనుమంట్ర మండలంలోని ఎస్ ఇల్లింద్రపర్రు, ఆలమూరు, నెలమూరు, ఓడూరు, పొలమూరు గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లో పారిశుధ్యం, వైద్య సదుపాయాలను ఆయన పరివేక్షించారు. అనంతరం మంత్రి రంగనాధరాజు మాట్లాడుతూ.. ప్రజలెవరూ బయట తిరగవద్దని కోరారు. పంటలు చేతికి వస్తున్న తరుణంలో రైతులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు, రూ.1000 ఆర్థిక సాయం గురించి వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు.