దేవుళ్లతో చంద్రబాబు రాజకీయాలు
తాడేపల్లి: ప‌్రతిపక్ష నేత చంద్రబాబు దేవుళ్లతో రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆలయాలపై దాడుల ఘటన వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీదిరి అప్పలరాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మంత్రి ధ్వజమెత్తారు. చంద్రబాబు తన కంటే గొప్ప నటుడని ఆనాడే ఎన్టీ రామారావు పేర్కొన్నారని గుర్తు చేశారు. టీడీపీ నేతలు తప్పు చేస్తే అరెస్టులు చేయకూడదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతల అరెస్టుపై చంద్రబాబు ముందస్తు స్టే కూడా తెచ్చుకుంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ డైలాగులు చెప్పడంలో తన మామను అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రమేష్ ఇప్పటికీ టీడీపీ ఎంపీనే అని ..అతని మాటలకు విలువ లేదన్నారు.ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. రామతీర్థం ఘటనపై అవసరమైతే సీబీఐ విచారణ కోరతామని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.