చిడతలు వాయిస్తూ డబ్బు సంపాదించడం చిడతల నాయుడికే చెల్లు
తాడేపల్లి: చిడతలు వాయిస్తూ డబ్బు సంపాదించడం చిడతల నాయుడికే చెల్లిందని మంత్రి పేర్నినాని విమర్శించారు. తాను దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి భక్తుడినని, తనది స్వామి భక్తి అని, చనిపోతూ కూడా వైయస్ కుటుంబానికి భజన చేస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రైతుల గురించి మొసలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో రైతులు నష్టపోతే పవన్ రైతులకు ఎంత ఇప్పించారని నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
చిడతలు వాయిస్తూ డబ్బు సంపాదించే నైజం చిడతల నాయుడి సొంతమన్నారు. 2014లో హైటెక్స్‌లో మీటింగ్ పెట్టి మోదీకి చిడతలు కొట్టింది పవనే అన్నారు. నెల తిరక్కముందే చంద్రబాబుకు చిడతలు కొట్టారని గుర్తు చేశారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి..ప్రశ్నించడం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోగానే మోదీ కాళ్ల దగ్గరకు చేరి పవన్ చిడతలు కొట్టారని తెలిపారు. చిడతలు వాయించడంలో కూడా డబ్బులు సంపాదించడం భూ ప్రపంచంలో చిడతల నాయుడికి మాత్రమే సొంతమన్నారు. సోనియాకు రివర్స్ చిడతలు కొట్టారని, మోదీకి చిడతలు కొట్టారని వివరించారు. జనం పవన్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే అన్నారు. పవన్‌ది అంతా సినిమా సెట్టింగ్‌లు, ప్యాకప్ వ్యవహారమన్నారు.
గతంలో తుపానుల వల్ల రైతులు నష్టపోతే చంద్రబాబు, పవన్ నాయుడు ఎంతిచ్చారని మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. పవన్, ఆయన పార్టనర్ కలిసి ఎగ్గొట్టిన ఇన్పుట్ సబ్సిడీని కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెల్లించిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ ఎప్పుడయ్యారని, ఏ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారని మంత్రి ప్రశ్నించారు.పవన్ వకీల్ అన్నది ఎంత నిజమో? రైతుల పట్ల ఆయన చేసిన పోరాటం అంతే నిజమన్నారు. పవన్ ఆటలో అరటిపండు లాంటి వ్యక్తి అన్నారు. షూటింగ్‌లు లేకపోతేనే పవన్‌కు జనం గుర్తుకు వస్తారని చెప్పారు. అలాంటి నాయకుడు బందర్ వచ్చి మీ ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నిస్తున్నారని, మా ఇంటికి వస్తానని పవన్ అంటున్నారని తెలిపారు. ఏ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే? రాష్ట్రంలో ఎవరు మంత్రులుగా ఉన్నారో తెలియకుండానే పవన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మా ఇంటికి వస్తే పచ్చడి అన్నమే..అదే చంద్రబాబు ఇంటికి వెళ్తే సూట్ కేసులు అందుతాయన్నారు. పవన్ దమ్మున్న నాయకుడైతే గుడివాడ వెళ్లి అక్కడ ఎందుకు కొడాలి నాని పేరు ఎత్తలేదని ప్రశ్నించారు. తాను కూడా కాపు నాయకుడినేనని, ఆయన మాదిరిగా తాను కూడా ఎవరికి భయపడనని స్పష్టం చేశారు.
పవన్‌ను నమ్ముకున్న తుళ్లూరు రైతుల నట్టేట మునిగారని మంత్రి పేర్నినాని గుర్తు చేశారు. అమరావతి, ఉండవల్లి గ్రామాలకు వెళ్లి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చి ..ఆ తరువాత కనిపించకుండా వెళ్లారని తెలిపారు.పవన్ కల్యాణ్ ఆయన సొంత అన్నయ్య చిరంజీవికి అండగా లేరని గుర్తు చేశారు. జనాల్లోకి రావడం, ధర్నాలు చేయడం పవన్‌కు వ్యాపారంగా మారిందన్నారు. రైతు భరోసా పథకం-పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు ప్రధాని మోదీ రూ.2 వేలు ఇస్తే..సీఎం వైయస్ జగన్ రూ.7,500 ఇచ్చారని వివరించారు. ప్రధాని కేవలం రైతులకు మాత్రమే ఇస్తున్నారని, సీఎం వైయస్ జగన్ కౌలు రైతులకు కూడా పెట్టుబడికి డబ్బులు ఇస్తున్నారని చెప్పారు. గిరిజన రైతులకు, అసైన్డ్ రైతులకు కేంద్రం డబ్బులు ఇవ్వడం లేదని చెప్పారు. వకీల్ సాబ్‌కు దమ్ముంటే మోదీ సాబ్‌కు చెప్పి కౌలు రైతులకు కూడా డబ్బులు ఇప్పించాలని మంత్రి పేర్ని నాని సవాలు విసిరారు. సహస్రకోటి నాయుడుల్లో పవన్ ఓ బోడి నాయుడని దుయ్యబట్టారు.
సినిమాలు చేసుకోవద్దని ఎవరు చెప్పారు
వందల కోట్ల సంపాదనను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ నాయుడు చెప్పుకుంటున్నారని, అసలు ఆయన్ను ఎవరు పిలిచారని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అంటే వందల కోట్లు వదలి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తరువాత లక్షల కోట్లు సంపాదించాలని వచ్చారా అని నిలదీశారు. వైయస్ జగన్ సీఎం కాగానే..మీరు బ్రహ్మండంగా పరిపాలించండి..నేను సినిమాలకు వెళ్తానని చెప్పింది పవన్ కాదా అని ప్రశ్నించారు. పూటకో మాట మాట్లాడుతున్న పవన్ నాయుడికి స్థిరత్వం లేదన్నారు. ఇష్టం వచ్చినట్లు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురించి, ప్రభుత్వం గురించి పవన్ నాయుడు మాట్లాడితే ఒప్పుకునేది లేదని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.