నిమ్మగడ్డ స్వామి భక్తి చూపుతున్నారు
అమరావతి : ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వామిభక్తి చూపుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డకు అవకాశం వచ్చిందని.. అందుకే టీడీపీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో తీర్పు రాకముందే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారని తప్పుపట్టారు. వాక్సినేషన్ పూర్తి కాకుండానే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ప్రబుత్వ నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు నిమ్మగడ్డ రమేష్ తీరు సరిగా లేదని మంత్రి తప్పుపట్టారు.
చంద్రబాబు డైరెక్షన్‌లో నిమ్మగడ్డ పని చేస్తున్నారు: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
వ్యాక్సిన్ పూర్తయ్యే వరకూ ఎన్నికలు వాయిదా వేయాలని కోరినా ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. నిమ్మగడ్డ కేవలం చంద్రబాబు డైరెక్షన్‌లోనే పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం వైయస్ జగన్ పాలన చూసి ఓర్వలేకపోతున్నారని, రాజకీయ ఉనికి కోసం ప్రతిపక్షాలు నీచంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వ సూచనలు, ఉద్యోగుల అభ్యర్థనలు తోసిపుచ్చి ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం నిరంకుశత్వానికి అద్దం పడుతోందని, వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికల నిర్వహణ సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు.