రాష్ట్రానికి ఈ–గవర్నెన్స్ అవార్డు సీఎం ఘనతే
తాడేపల్లి: మునుపెన్నడూ లేని విధంగా పంచాయతీ రాజ్ శాఖలో ఏపీకి 17 అవార్డులు వరించాయని, అత్యధిక అవార్డులు సాధించిన రాష్ట్రంగా దేశంలోనే ఏపీ 4వ స్థానంలో నిలిచిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అంతేకాకుండా ఈ–గవర్నెన్స్ అవార్డును కూడా సాధించుకున్నామన్నారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ పంచాయతీ రాజ్ శాఖలో అవార్డులను ప్రదానం చేశారన్నారు. రాష్ట్రానికి ప్రప్రథమంగా 17 అవార్డులు వచ్చాయని, దేశంలోనే అతి ఎక్కువగా అవార్డులు అందుకున్న నాల్గవ రాష్ట్రంగా నిలిచామన్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లకు, 4 మండలాలకు, పంచాయతీలకు అన్నీ కలిపి 17 అవార్డులు వచ్చాయన్నారు. ఈ–గవర్నెన్స్ కింద అవార్డు కూడా వచ్చిందని, మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం సీఎం వైయస్ జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతంగా జరుగుతున్నాయని ఈ–గవర్నెన్స్ కింద అవార్డు ప్రదానం చేశారన్నారు. సీఎం వైయస్ జగన్ చొరవతోనే ఈ అవార్డు వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో పంచాయతీ రాజ్ శాఖను మరింత బలోపేతం చేసి.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు.