ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేయాలి 

30 Sep, 2019 12:00 IST

విజయవాడ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు తీసుకువచ్చేలా పనిచేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడ ఏప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. కేవలం మూడు నెలల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన నవరత్నాలను తూచా తప్పకుండా అమలు చేయాలి.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందాలనే ఆలోచనతో ఈ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఇంటి వద్దకే వెళ్లి 35 రకాల సంక్షేమాలు అందజేసే గొప్ప బాధ్యతను ముఖ్యమంత్రి మీకు కల్పించారని సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. 

అక్టోబర్‌ 2వ తేదీన ఈస్ట్‌ గోదావరి జిల్లాలో జరిగే సచివాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాల్గొంటారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1,34,918 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఉపాధి కల్పించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని మరోసారి సూచించారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపిక పరీక్షల గురించి కొందరు అబద్ధపు రాతలు రాశారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. చాలా మంది కోర్టులకు కూడా వెళ్లారన్నారు. కానీ, ఉద్యోగుల ఎంపిక చాలా పారదర్శకంగా చేయబట్టే అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. గ్రామాల్లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా.. సచివాలయంలో కౌంటర్‌లు ఉంటాయి. మీరు తక్షణమే స్పందించి ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఉద్యోగులకు సూచించారు. సచివాలయం ముందు అర్హులైన వారి పేర్లు కూడా ఉంటాయి. సోషల్‌ ఆడిట్‌ కూడా గ్రామస్తులే చేసుకుంటారన్నారు.