బడుగుల అభివృద్ధి నీ కళ్లకు కనిపించడం లేదా రామోజీ..?
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెరదీశారని, దానికి ఉదాహరణలు కోకొల్లలని రాష్ట్రమంతా కోడై కూస్తుంటే.. వృద్ధ రామోజీరావు కంటికి మాత్రం ఇవి కనిపించడం లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. బడుగుల అభివృద్ధి రామోజీరావు పచ్చ కళ్లకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అణగదొక్కిన చంద్రబాబే రామోజీరావుకు స్వీటు అయ్యాడని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున ఏం మాట్లాడారంటే..
నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థల కన్నా మిన్నగా తీర్చిదిద్ది పేద కుటుంబాల్లోని పిల్లల చదువుకు వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థి కాలి షూ, సాక్స్ దగ్గర్నుంచీ యూనిఫాం, బ్యాగ్, పుస్తకాలు, చివరికి వారికి పాఠశాలలో తినిపించే గోరుముద్ద వరకు అన్ని విషయాల్లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధచూపుతూ.. ఇంగ్లీషు మీడియం విద్యనందిస్తోంది. ఆమేరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులు ఇంగ్లీషును కూడా అనర్గళంగా మాట్లాడటం ఈ కళ్లు లేని కబోధి రామోజీరావుకు కనిపించడంలేదంట.
అంబేద్కర్ భావాల్ని చంద్రబాబు అణగదొక్కాడు
పేద పిల్లలకు చదువు పెద్దగా అబ్బకూడదని కుట్ర చేసిన వ్యక్తి నారా చంద్రబాబునాయుడు. ఆయన హయాంలో దాదాపు రాష్ట్రంలో 6వేల ప్రభుత్వ పాఠశాలల్ని మూసేశాడు. ఒకే పెన్‌స్ట్రోక్‌తో అసలు జీవోలే లేకుండా రాష్ట్రంలో 2 వేల హాస్టళ్లు కూడా మూసేయించాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లల విద్యపై ఆనాడు అంబేద్కర్ మహాశయుని ఆలోచనల్ని పూర్తిగా తుంగలో తొక్కిన వ్యక్తి ఈ చంద్రబాబు. పేదల ఎదుగుల, వారి సంక్షేమం, వారి పిల్లల విద్య, ఆరోగ్యం, కుటుంబాల బాగోగులపై చంద్రబాబు ఇంతగా దగా చేస్తే ఈ రామోజీరావుకు అప్పట్లో కనిపించలేదంట.
సామాజిక విప్లవానికి తెరదీసిన నాయకుడు వైయస్ జగన్
తరతరాలుగా ఎదుగుబొదుగులేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన్ను సామాజిక విప్లవానికి ధైర్యంగా ముందడుగేసిన నాయకుడిగా ప్రతీ పల్లెల్లో వాడల్లో మా ఎస్సీ, ఎస్టీలు దేవుడిగా కొలుస్తున్నారు. మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్‌లు పెట్టి వాటి ద్వారా ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి ఎస్సీ కులాల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్. ఐదేళ్ల చంద్రబాబు అధికార హయాంలో రూ.33వేల కోట్లు మాత్రమే ఎస్సీలకు ఖర్చుచేస్తే.. అదే మా వైయస్ జగన్ అధికారంలోకొచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలోనే రూ. 66వేల కోట్లు ఖర్చు చేసి ఎస్సీ కులాల్ని అభివృద్ధిలోకి తెచ్చారు. ఎస్టీలకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో లబ్ధిదారులు అనాదిగా ఎలాంటి హక్కులు లేకుండా సాగుచేసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి భూముల్ని గుర్తించి సుమారు 22వేల ఎకరాల భూముల్ని 22ఏ జాబితా నుంచి తొలగించి.. వారికి సంపూర్ణ హక్కలు ప్రసాదించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతోంది.
కార్పొరేట్లకు దోచిపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్
ఆనాడు చంద్రబాబు హయాంలో బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లు అంటూ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి ఆయన కారకుడయ్యాడు. అరకొర సీట్లను భర్తీ చేసి చదువు చెప్పకపోయినా.. ప్రభుత్వ ధనాన్ని ఈ స్కూళ్ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు చంద్రబాబు ధారాదత్తం చేశారు. విదేశీవిద్య పేరిట ప్రభుత్వ ఖజానా నుంచి రూ.కోట్లుకు రూ.కోట్లు ఆనాడు నారాయణ, చైతన్య మిగతా కార్పొరేట్ విద్యాలయాలకే అప్పగించారు. అలాంటిది, ఈనాడు ప్రభుత్వ పాఠశాలలే ఇండియాలో నెంబర్1 స్థానానికి చేరుకుని పేద పిల్లల్ని ఇంగ్లీషుమీడియంలో చదివించడానికి తపన పడుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలను చూసి భయపడే పరిస్థితి ఉంది.
గునపాలతో లేపినా చంద్రబాబుకు అధికారం కలే
ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడనేది పిల్లోడ్ని కదిలించినా చెబుతున్నాడు. అందుకే, ఈనాడు రామోజీరావు రోజుకో రీతిగా ప్రభుత్వ పథకాలపై, లబ్ధిపొందుతున్న వర్గాలపై రామోజీరావు రోత రాతలు రాస్తున్నాడు. ఆయనెంతగా రాసుకుని ప్రజల ముందుకు తీసుకెళ్లి విషం కక్కాలని ప్రయత్నించినా .. గునపాలతో పైకి లేపి అధికారపీఠం మీద కూర్చోబెట్టాలనుకున్నా గానీ రామోజీరావు పిచ్చికలే గానీ.. ఫలితం మాత్రం ఏమీ ఒనగూరదని తెలుసుకోవాలి.
పేదరికం తగ్గుముఖం
చంద్రబాబు ప్రభుత్వంలో దళితులు రక్షణ లేనివిధంగా బిక్కుబిక్కు మంటూ బతికారు. ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం మారుతుందా..? అని అందరూ ఎదురుచూశారు. అదే వైయస్ జగన్ అధికారంలోకొచ్చాక దళిత కుటుంబాల స్థితిగతులు మారాయి. దళితులు ధైర్యంగా బతుకుతున్నారు. నాడు 12 శాతం ఉన్న పేదరికం నేటికి 6 శాతానికి వచ్చిందంటేనే వైయస్ జగన్ పరిపాలనా సమర్థత ఎంతగా ఉండేదో ఆందరం గమనించాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఎస్టీ కమిషన్ ఉండేదికాదు. అదే వైయస్ జగన్ ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా దళిత క్రైస్తవుల్ని ఎస్సీలు చేసేందుకు తీర్మానం చేసిన చరిత్ర వైయస్ జగన్‌దని తెలియజేస్తున్నాను.
పేదోడి సంక్షేమాన్ని అడ్డుకోవడానికి కోర్టులకెళతారా..?
ఎస్సీ, ఎస్టీల పిల్లలకు ఇంగ్లీషు చదువు బోధించడానికి వీల్లేదని చంద్రబాబు తన మనుషుల్ని కోర్టుల్లో పిటీషన్లు వేయిస్తాడు. రాష్ట్రంలో 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేస్తుంటే.. దానికి అడుగడుగునా మోకాలడ్డారు. ఆఖరికి రాజధాని అమరావతి ప్రాంతంలో 50వేల మంది పేదలకు ఇళ్లస్థలాలిస్తుంటే.. డెమోగ్రాఫికల్ ఇన్‌బ్యాలెన్స్ వస్తుందంటూ కోర్టుల్ని ఆశ్రయించారు. కింది కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లి మా నాయకులు వైయస్ జగన్ పేదోడిపక్షాన నిలిచి పైచేయి సాధించారు. ఇవన్నీ రాష్ట్రం మొత్తం చూస్తున్న విషయాలే కదా..? కానీ, రామోజీరావుకు మాత్రం ఎందుకు కనిపించవని ప్రశ్నిస్తున్నాను.
టీడీపీ నడిపిన కాల్‌మనీ, సెక్స్‌రాకెట్లు కనిపించలేదా..?
చంద్రబాబు హయాంలో స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలే విజయవాడలో కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ నడిపించిన నీచమైన చరిత్ర వారిది. ఇదే విషయంపై శాసనసభలో చర్చ జరిగితే.. అంబేద్కర్ పేరును అప్పట్లో తెర మీదికి తెచ్చి అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని పెడతామని చెప్పి.. పిచ్చిచెట్లు, ముళ్లపొదల మధ్య పెట్టాలని చూశారు. ఐదేళ్ల పాలనలోనూ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ఏమీ చేయలేకపోతే ఎల్లోమీడియా దాన్ని రాయరు. ఎప్పటికీ ఆ ఊసే ఎత్తరు.
రూ.400 కోట్లతో అంబేద్కర్ విగ్రహం
ప్రపంచం గర్వించేవిధంగా దేశచరిత్రలో ఎక్కడా లేనివిధంగా, విజయవాడ నడిబొడ్డున.. ఒకప్పుడు చంద్రబాబు అమ్ముకోవాలని ప్రయత్నించిన అత్యంత ఖరీదైన ప్రాంతంలో 125 అడుగుల అంబేద్కర్ మహాశయుని విగ్రహాన్ని రూ.400 కోట్లతో వైయస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సువర్ణాక్షరాలతో లిఖించబడుతూ ప్రపంచంయావత్తూ వైయస్ జగన్ ప్రయత్నాన్ని కొనియాడుతుంటే రామోజీరావు మాత్రం ఎందుకు రాయలేకపోతున్నాడు..? చంద్రబాబు మోసాలు రాయడు. వైయస్ జగన్ కృషిని కూడా రాయలేని వృద్ధదద్దమ్మ ఈ రామోజీరావు.
బాబు హయాంలో దళితులపై దాడులు ఎన్నెన్నో..
చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు ఎన్నెన్నో జరిగాయి. అప్పట్లో దళితులపై జరిగిన దాడులు దేశంలోనే 4వ స్థానంలో ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదికలున్నాయి. కారంచేడు, పదిరికుప్పం, చుండూరు, నీరుకొండ ఘటనలన్నీ చంద్రబాబు హయాంలో ఆయన సామాజికవర్గం చేసిన దాష్టీకాలేనని ప్రతీ ఒక్కరికీ తెలుసు. కానీ, రామోజీరావుకు మాత్రం ఇవేమీ తెలియవు. ఒకవేళ తెలిసినా ఏమీ తెలియదన్నట్లు నటించే మేధావి అతడు. అదే, వైయస్ జగన్ పాలనలో ఎక్కడ ఏ చిన్నపాటి ఘటన జరిగినా ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలతో గుడ్డకాల్చి మీదేసే నైజానికి ఒడిగడతాడు.
రామోజీ.. ఇకనైనా నీ జర్నలిజం మార్చుకో..
దళితుల భూముల్ని లాక్కుని ఫిల్మ్‌సిటీని నిర్మించుకుని రూ.లక్షల కోట్లు ఆస్తులు పోగేసుకున్నందుకు రామోజీరావు సిగ్గుపడాలి. మా దళితులకు న్యాయం చేయలేని నువ్వు.. ఏపీలో దళితులకేదో అన్యాయం జరుగుతున్నట్లు దొంగ ప్రేమరాతలు రాస్తున్నావా..? దళితుల ఊచకోతకు కుట్రలు గట్టి దాడులు చేయించిన చంద్రబాబు, నువ్వు మామీద ప్రేమ చూపితే మురిసిపోయేంత అమాయకులెవరూ లేరని గమనించుకో.. ఇప్పటికైనా నీ నీచమైన రాతలు మానుకోమని చెబుతున్నాను. లేదంటే, అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి దళిత గిరిజనం అండగా ఉంటున్న నేపథ్యంలో రామోజీకి, ఇతర ఎల్లోమీడియాకు తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాను.