వాడుకోవడం..వదిలేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
6 Jan, 2021 15:54 IST
విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వాడుకోవడం, వదిలేయడం వెన్నతో పెట్టిన విద్య అని పౌరఫరాల శాఖ మంత్రి కోడాలి నాని విమర్శించారు. బుధవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత రాజకీయ అనుభవం ఉండి మతాలు, కులాల గురించి చంద్రబాబు మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సీఎం, హోం మంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. అధికారులు మతాల వారీగా పని చేయరని అన్ని వర్గాల ప్రజల కోసం పని చేస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంటే ఒక వ్యవస్థ అని అభివర్ణించారు.సంక్షేమ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం వైయస్ జగన్ గురించి మిడత లాంటి లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.