దళారీ వ్యవస్థను అరికట్టేందుకే రైతు భరోసా కేంద్రాలు
తాడేపల్లి: దళారీ వ్యవస్థను అరికట్టేందుకు రైతు భరోసా కేంద్రాలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకువచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై పచ్చ పత్రికల తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. అగ్రి ఫండ్స్ ప్రాజెక్టుల ప్రగతి, వ్యవసాయ మౌలిక సదుపాయాలపై సీఎం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షి నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై పలు ఆదేశాలు ఇచ్చారని, రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్వద్ద సమీక్ష వివరాలను మంత్రి కన్నబాబు తెలిపారు.
రైతులకు కావాల్సిన సహాయం అందించడం, శాశ్వత వనరులు కల్పించడమే లక్ష్యంగా ఈ రోజు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రూ.16,343 కోట్లతో మల్టీ పర్ఫస్ ఫెసిలిటీ కేంద్రాలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి గ్రామంలోని రైతులకు అవసరమైన గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు, కోల్డ్ రూములు, డ్రైన్ ప్లాట్‌ఫాంలు, అవసరమైన చోట బల్స్‌మీల్క్ సెంటర్లు, ఉద్యాన పంటలకు సంబం«ధించి కలెక్షన్ సెంటర్లు, ఆక్వాకు సంబంధించి మౌలిక వసతులు, అన్ని మార్కెట్ యార్డుల్లో నాడు–నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం మల్టీ పర్ఫస్ సెంటర్లుగా ఏర్పాటు చేస్తున్నాం. వీటిపైనే సీఎం వైయస్ జగన్ ఈ రోజు సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టులపై చర్చించారు. ఏ కార్యక్రమం ఎప్పుడు చేపట్టాలని సమీక్షించారు.
దేశం మొత్తం ఇవాళ సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వీటిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా శభాష్ అని మెచ్చుకుంటున్నారు. ఆర్బీకేలను దేశ వ్యాప్తంగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నీతి అయోగ్ బృందం కూడా మన అధికారులతో మాట్లాడారు. ఈ వ్యవస్థను ఎలా రూపొందించారని ఆరా తీశారు. ఈ పరిస్థితిలో రైతు భరోసా కేంద్రాలను పూర్తి సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఇటు ఎరువులు, విత్తనాలు నాణ్యమైనవి అందించాలని, మట్టి నమూనాలు, ఈ–క్రాప్ బుకింగ్‌లు, ధాన్యం సేకరణ వరకు అన్నింటిపై సీఎం వైయస్ జగన్ సమీక్షించి..పలు ఆదేశాలు ఇచ్చారు.
రైతు భరోసా కేంద్రాలకు ఐఎస్వో స్టాండెడ్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. చిత్రం ఏంటంటే..కొన్ని పత్రికల రాతలు చూస్తే..వారి కడుపు మంట కనిపిస్తోంది. ఒక వ్యవస్థ సక్సెస్ అయితే దానిపై ఏదోరకంగా బురద జల్లాలని, తగ్గించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. డీలర్ల వ్యవస్థను నాశనం చేసినట్లు మాట్లాడుతున్నారు.ఈనాడు పత్రికల్లో రాస్తున్నారు. డీలర్ల వద్ద ఎరువులు దొరకపోవడంతో రైతులకు అప్పులు దొరకడం లేదని రాస్తున్నారు. డీలర్ల ద్వారా అధిక ధరలకు కొనుగోలు చేయాలని, రైతులు అప్పులు చేయాలన్నదే ఎల్లో మీడియా ఉద్దేశమా?. ఆర్బీకేల్లో ఎంఆర్పీల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ధరకు అమ్మడం లేదు. నాణ్యమైన ఎరువులు రైతులకు సొంతూరులోనే అందజేస్తున్నాం. నాణ్యమైన ఇన్పుట్స్ ఇవ్వడమే ఆర్బీకేల ప్రధాన లక్ష్యం.
2021 ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 1.27 లక్షల టన్నుల ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించాం. ఇది 8.29 శాతం, సెల్ త్రూ ఫ్యాక్స్ ద్వారా 1.62 లక్షల టన్నులు..ఇది 10.75 శాతం, ఈ సీజన్లో ప్రైవేట్ డీలర్లు అమ్మిన ఎరువులు 12.43 లక్షల టన్నులు. ఇది 81.14 శాతం. దీనికి దానికి ఏమైనా పొంతన ఉందా?. డీలర్ల కొడుపు కొడుతున్నట్లు మాట్లాడుతున్నారు. రైతుల కడుపు కొట్టినా వీరికి ఫర్వాలేదా? రైతులు మోసపోవాల్సిందేనా?. నాణ్యమైన ఇన్‌ఫుట్స్ రైతులకు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పచ్చ పత్రికలు తప్పుపట్టడం బాధాకరం. మీ విశ్లేషణలు చౌకబారుగా ఉన్నాయని అనిపించడం లేదా?
ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా డీఏపీ కొరత ఉంది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయి. పోటాష్ కూడా ఉత్పత్తి తగ్గింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవన్నీ తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో బఫర్ స్టాక్ మెయింటెన్ చేస్తున్నాం. కావాల్సిన నిల్వలు ముందుగానే ఊహించి తీసుకువస్తున్నాం. ఎక్కడా ఎరువుల కొరత లేదు. డీఏపీ అవసరమైన జిల్లాలకు అందిస్తున్నాం. పోటాషియం కొరత ఉంటుందని తెలిసి సీఎం వైయస్ జగన్ వారం క్రితమే సమీక్ష నిర్వహించి ఆదేశాలు ఇచ్చారు. నిన్న రాత్రి నుంచి విశాఖ పోర్టులో పోటాషియం దిగుమతి అయ్యింది.
ఖరీఫ్‌లో 22.71 లక్షల టన్నులు అవసరమవుతాయని అంచనా..ఇప్పటి 15.32 లక్షల టన్నులు విక్రయించారు. ఇందులో 7.38 లక్షల టన్నుల ఎరువుల స్టాక్ ఉంది. డీఏపీ కొరత లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ప్రతి రోజు ఎరువులపై వ్యవసాయ శాఖ సమీక్షి నిర్వహిస్తూ..ఎప్పటికప్పుడు సీఎం వైయస్ జగన్‌కు వివరాలు అందిస్తున్నాం. మీరు వచ్చి డీలర్ల వ్యవస్థను దెబ్బతీసినట్లుగా మాట్లాడుతున్నారు. రైతులు అప్పులు తెచ్చుకోకూడదనే కదా వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ నిధి కింద ప్రతి ఏటా పెట్టుబడి సాయం రూ.13,500 ఇస్తున్నాం. వైయస్ఆర్ ఉచిత పంటల బీమా తీసుకువచ్చాం. వడ్డీలేని రుణాలు ఇస్తున్నాం. రైతులపై ఒత్తిడి పడకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే..టీడీపీకి అనుకూలమైన వాణిని వినిపించే తపన తప్ప..రైతాంగం పట్ల మీకు బాధ్యత లేదా? ఎక్కడ తప్పు జరుగుతుంది?
ఆర్బీకేల్లో ఎంఆర్పీ ధరలకే ఎరువులు విక్రయిస్తున్నాం. రైతు అడిగితే 24 గంటల్లో స్టాక్ తీసుకువస్తున్నాం.ఇవే కాకుండా కొత్తగా ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని సబ్ డీలర్‌గా గుర్తించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందడం జరిగింది. ఇదొక చారిత్రాత్మక విజయం. సబ్ డీలర్‌గా ఉండటం వల్ల రావాణకు సౌకర్యవంతంగా ఉంటుంది. సీఎం వైయస్ జగన్ ముందు చూపు వల్లే ఇదంతా సాధ్యమైంది. రైతులకు అవసరమైన ప్రతి అంశాన్ని ఎంత సుక్ష్మంగా ఆలోచిస్తున్నారని చెప్పడానికి ఆర్బీకేలు ఒక ఉదాహరణ. ఆర్బీకేలను చులకన చేసే కార్యక్రమం మంచిది కాదని మంత్రి కన్నబాబు హితవు పలికారు.
గ్రామాల్లో గోడౌన్ల నిర్మాణాలకు స్థలం కొరత ఉంటే ఎక్చెంజ్ పద్ధతిలో భూమి తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆరుతడి పంటల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. బోర్ల కింద పండించిన పంటను 50 శాతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మిల్లెట్స్ ఏరియాలో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టమని సీఎం ఆదేశించారు. 27 చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మొదటి దశ నిర్మాణాలకు వచ్చే ఫిబ్రవరిలో శంకుస్థాపనలు చేయాలని సీఎం సూచించారని మంత్రి తెలిపారు.