శ్యామ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
నెల్లూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, చెముడుగుంటలోని శ్రిడ్స్ కళ్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తో కలిసి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేతలందరూ కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమయం తక్కువగా ఉందని, సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల కన్వీనర్లు వారి వారి మండలాలలోని సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులతో ఆయా పంచాయతీలలోని నాయకుల పర్యవేక్షణలో ప్రతి ఒక్క ఓటరు నేరుగా మూడుసార్లు కలిసి ఓటును అభ్యర్థించాలని సూచించారు. 2014, 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో తన గెలుపు కోసం శ్యామ్ కష్టపడి పనిచేసి, నా విజయంలో కీలక భూమిక పోషించాడని తెలిపారు. పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మీ అందరితో పాటుగా తనకు ఉందని, నేను కూడా ఈ వారం రోజులు పాటు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను ఎన్నికల తేది నాటికి జిల్లాకు రప్పించాలని, పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేలా దృష్టి సారించాలని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యదిక మెజారిటీ తీసుకురావాలని నియోజకవర్గ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు.
వైయస్ఆర్సీపీ మద్దతుదారుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ...పార్టీ ఆవిర్భావం నుంచి తనకు అన్ని వేళల్లో సహాయ సహకారాలు అందిస్తూ, పార్టీలో తన ఎదుగుదలకు తోడ్పడుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 13వ తేదీ జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి ఆశీర్వదించాలని కోరారు.
ముఖ్య నేతల సమావేశం
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వైయస్ఆర్సీపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. నెల్లూరు వీపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి, జిల్లా అద్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్రమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు, మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు,