పార్ట్–1 రెక్కీ, పార్ట్ –2 రాయి, పార్ట్–3 ఇప్పటంలో పిచ్చి కల్యాణ్
తాడేపల్లి: చంద్రబాబు- పవన్ కల్యాణ్ కుట్ర రాజకీయాల్లో భాగంగానే.. పార్ట్–1 రెక్కీ, పార్ట్ –2 రాయి, పార్ట్–3 ఇప్పటంలో పిచ్చి కల్యాణ్ పిచ్చికూతలు మూడు రోజులుగా ఒక సీరియల్ ప్రకారం నడుస్తున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా తొలగించలేదన్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు మాత్రమే తొలగించామని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ పనికిమాలిన పిచ్చి కూతలు కూస్తున్నాడని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడు. పవన్ ఇంటి వద్ద రెక్కీ అంటూ డ్రామాలు ఆడుతున్నారన్నారు. రెక్కీ నిర్వహించలేదని తెలంగాణ పోలీసులే స్పష్టంగా చెప్పినా డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి పనికిమాలిన వ్యక్తులు మా ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదల్చలేరన్నారు. చంద్రబాబు హయాంలో వేల ఇళ్లను, వందల ఆలయాలను కూల్చేశారని మంత్రి జోగి రమేష్ గుర్తుచేశారు. గాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి కూల్చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. కళ్లుండి చూడలేని కబోది రామోజీరావు.. ప్రభుత్వంపై విషం చిమ్ముతూ తప్పుడు రాతలు రాస్తున్నాడని ధ్వజమెత్తారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్ ఇంకా ఏమన్నారంటే..
ఇప్పటం గ్రామంలో అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది అనే దానిపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పనులకు అధికారులు టెండర్లు పిలవడం, గత జనవరిలోనే మార్కింగ్ ఇవ్వడం, మొదటి విడత విస్తరణ పనులు కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ప్రారంభించారంటూ ఆ గ్రామస్తులంతా స్వయంగా మీడియా ప్రతినిధులకు చెప్పడం చూశాం. వాస్తవం ఇలా ఉంటే.. బ్రహ్మాండం ఏదో బద్ధలు అయినట్లు, పవన్ సభకు స్థలం ఇచ్చారనే కక్షతో ప్రభుత్వం ఇళ్లు కూల్చేసినట్లు పవన్ కల్యాణ్ ఆరోపిస్తే.. దానికి తానా తందానా అంటూ చంద్రబాబు ట్వీట్లు పెట్టాడు. వీరిద్దరివీ పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు.
ఇప్పటం గ్రామంలో ఒక్క ఇల్లును కూడా కూల్చిన దాఖలాలు లేనేలేవు. ఆ గ్రామంలో రోడ్డు విస్తరణలో, డ్రైనేజ్ పనుల్లో భాగంగా అడ్డం వచ్చిన చిన్నచిన్న ఆక్రమణలను, ప్రహరీ గోడలను తొలగించడం జరిగింది. ఇవిగో సాక్ష్యాలు.. అంటూ ఆక్రమణలను తొలగించిన ఫోటోలను మీడియాకు విడుదల చేస్తున్నా. రోడ్డు విస్తరణ వల్ల తమ గ్రామం అభివృద్ధి చెందుతోందని, తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని గ్రామస్తులంతా ఆనందంగా, సంతోషంగా ఉన్నారు.
అక్కడ ఒక కులానికో, ఒక పార్టీకో అన్యాయం జరిగినట్లు, టీడీపీ, జనసేన పార్టీ వాళ్ల ఇళ్లు కూల్చేశారని పచ్చ పత్రిక ఈనాడులో రాతలు.. పవన్ కల్యాణ్, చంద్రబాబులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటంలోని మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను పగులకొట్టి చెత్తలో పడేసినట్లు ఇష్టం వచ్చినట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఆ విగ్రహాలను పంచాయితీ కార్యాలయంలో భద్రంగా ఉంచడమే కాకుండా, వాటిని మళ్లీ ప్రతిష్టించడం జరుగుతుంది. ఆక్రమణల తొలగింపులో భాగంగా రాజశేఖర రెడ్డి విగ్రహం దిమ్మెను కూడా పగులగొట్టారు. వాస్తవాలు ఇలా ఉంటే.. వక్రీకరణలతో పవన్ కల్యాణ్, చంద్రబాబు, ఎల్లో మీడియా అండ్ కో.. ఇష్టం వచ్చినట్లుగా దుష్ప్రచారాలు చేస్తూ, ప్రభుత్వంపై బురదచల్లుతున్నారు.
ఎన్నో ఇళ్ళు, గుడులు కూల్చిన బాబు కూల్చివేతలు అని మాట్లాడటమా..?
ఇప్పటంలో ఏదో విధ్వంసాలు జరిగిపోయినట్లు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం మరింత ఆశ్చర్యం వేసింది. కూల్చివేతల గురించి మాట్లాడే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. చంద్రబాబు హయాంలో పుష్కరాలు వస్తే.. ఎన్ని వేల ఇళ్ళను కూల్చేశావు. ఆఖరికి విజయవాడలో దేవాలయాలను, దేవుళ్ల విగ్రహాలను కూల్చివేసిందీ, వాటిని చెత్తలో పారేసింది మీరు కాదా?. ఇబ్రహీంపట్నంలో మహాత్మగాంధీ విగ్రహాన్ని అర్థరాత్రి కూలగొట్టించింది మీరు కాదా? విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేసి బుడమేరు కాల్వలో పడేసిన విషయాన్ని మరిచిపోయారా?. మేము అధికారంలోకి వచ్చాక గాంధీ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాము. ఇళ్లు, దేవాలయాలు, మహాత్ముల విగ్రహాలు కూల్చేసిన పాపానికి ప్రజలు నిన్ను నిట్టనిలువునా రాజకీయ సమాధి చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి చెందినవాళ్ల ఇళ్లు కూల్చేశారంటూ వాగటం, ఈనాడు పత్రికలో బ్యానర్ వార్తగా అచ్చేయడం... వాళ్లు ఇప్పటం రావడం, వీళ్ళు మాట్లాడిన చెత్తనంతా మళ్లీ మీ పత్రికల్లో, టీవీల్లో ప్రచారం చేయడం.. ఇదొక సైకిల్ లా తిరుగుతోంది.
పిచ్చి కల్యాణ్ కారుకూతలు
ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు ఉన్నాయి.. పిచ్చి కల్యాణ్ కారుకూతలు. ఇడుపులపాయ మీదుగా హైవే వేసేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. 2019 ఎన్నికల్లో పోటీచేసిన భీమవరం, గాజువాకల్లో రెండుచోట్ల గెలువలేకపోయావు. ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోని అసమర్థుడివి. ఈ మహానుభావుడు ఇడుపులపాయ మీదగా రోడ్డు వేస్తాడట. అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతో చేస్తున్న చేష్టలు మీవి. గతంలో ఇప్పటం వచ్చి, మీటింగ్ లో చెప్పిన హామీని అమలు చేశావా? ఇప్పటం గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని కోతలు కోశావు కదా? ముందు వాటిని అమలు చేయాలి కదా. పవన్ కల్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఇప్పటంలో అన్నివర్గాల ప్రజలు మాకు సహకరిస్తున్నారు. పనికిమాలినవాళ్లను కొంతమందిని పోగేసి, ఇప్పటం వెళ్లి రెచ్చగొట్టడం సరైన పద్ధతేనా?.
పవన్ కల్యాణ్ ఎందుకు పనికిరాని చవట అని రెండుచోట్ల ప్రజలు ఓడించేశారు. అయినా సిగ్గూ ఎగ్గూ లేకుండా, పెద్ద పెద్ద మాటలు, పిచ్చకూతలు, రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారు. కూల్చేస్తున్నారంటూ ఓ పచ్చ పత్రిక పెద్ద ఆర్టికల్ రాసింది. రామోజీరావు ఉండేది హైదరాబాద్ లో. ప్రతిరోజు విషం కక్కేది ఏపీలోని వైయస్ జగన్ ప్రభుత్వం మీద. హైదరాబాద్ నుంచి ఇప్పటం వస్తే వాస్తవాలు కనిపిస్తాయి. నిజంగా ఇళ్లు కూలగొట్టామా? రోడ్డు విస్తీర్ణంలో భాగంగా ఆక్రమించుకుని కట్టుకున్న ప్రహరీగోడలను జరిపామా అనేది తెలుస్తుంది. కళ్లుండి చూడలేని రామోజీరావు నిత్యం విషం చిమ్ముతూ ప్రభుత్వంపై నిత్యం బురదచల్లుతున్నాడు. జర్నలిజం విలువల్ని రామోజీరావు మంటగలుపుతున్నాడు. వీళ్లంతా పూజకు పనికిరాని పువ్వులు.
పవన్ పై రెక్కీ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..?
ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పవన్ కల్యాణ్ పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. పైపెచ్చు రూ. 250కోట్ల సుపారీ ఇచ్చి తనపై రెక్కీ నిర్వహించారని చెప్పడం సిగ్గుచేటు. పవన్ కల్యాణ్ కు తగ్గట్టు చంద్రబాబు నాయుడు కూడా తగుదునమ్మా అంటూ ఆ పార్టీ నాయకులు రెక్కీ అంటూ గగ్గోలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. రెక్కీపై తెలంగాణ పోలీసులు ఏం చెప్పారో మర్చిపోయారా?. అసలు రెక్కీనే జరగలేదని తెలంగాణ పోలీసులే తేల్చి చెప్పారు కదా. నిన్ను చంపడానికి సుపారీనా? నిన్నెవడు చంపుతాడు. నీ జోలికి ఎవడు వస్తాడు?. నీకు నష్టం చేస్తే తద్వారా లబ్ధి పొందేది ఒక్క చంద్రబాబే కదా.. రెక్కీలు, సుపారీలు చేస్తేగీస్తే అతనే చేయాలి. ఇప్పటం వచ్చి రక్తాలు చిందిస్తాం అంటూ జనాలను రెచ్చగొట్టడం ఏమిటి?. వారం మొదట్లో హైదరాబాద్ లో సినిమాలు చేసుకుంటావు. వీకెండ్స్ లో ఆంధ్రాకు వచ్చి పనికిమాలిన రాజకీయాలు చేస్తావు. మీ దత్తతండ్రి రాత్రి హైదరాబాద్ వెళితే... దత్త పుత్రుడేమో తెల్లారేపాటికి ఇక్కడ దిగాడు. రెక్కీ అనగానే పవన్ మీద చంద్రబాబు సానుభూతి, రాయి పడగానే చంద్రబాబు మీద పవన్ ప్రేమ ఒలకబోయడం.. వీరిద్దరి అనైతిక బంధం కళ్ళకు కనిపిస్తూనే ఉంది.
వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఇంచి కూడా కదిలించలేరు
కూల్చేస్తాం... కూల్చేస్తాం అని ప్రగల్భాలు పలికి ... చివరకు నిట్టనిలువునా మీరే కూలిపోయారు. మీ రెండు పార్టీలను ప్రజలు ఎప్పుడో కూల్చేశారు. అటువంటి మీరు, మా ప్రభుత్వాన్ని కూల్చుతారా...?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు చెప్పేదొకటే. వైయస్సార్ సీపీ ప్రభుత్వాన్ని, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఇంచ్ కూడా కదిలించలేరు. మా నాయకుడు ప్రజల మనసుల్లో ఉన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని మీరు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, వీధి నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. తెలుగుదేశం- జనసేన పార్టీలు రహస్యంగా పొత్తు పెట్టుకునే బదులు, బహిరంగంగా కలిసే కాపురం చేయవచ్చుగా. మిమ్మల్ని ఎవరు విడిగా ఉండమన్నారు. దానికోసం కుట్రలు ఎందుకు...?. లేకపోతే, తమ మధ్య ఏ పొత్తూ లేదు, ఒక్కొక్కరం ఒంటరిగానే పోటీ చేస్తామని ధైర్యంగా చెప్పండి. మీరు పిరికి సన్నాసులే కానీ.. మాటలు మాత్రం కోటలు దాటతాయి. చంద్రబాబు రెచ్చిపోతున్నాడు కదా?. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రిని అవుతానని చెప్పే ధైర్యం లేదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే పొత్తులు పెట్టుకోవాలి, ఒకరితో ఒకరు పొర్లాడాలి. ప్రజల మన్ననలు, వాళ్ల ఆశీస్సులు, ప్రేమ, ఆదరణే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి శ్రీరామ రక్ష. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నాయి.
పిచ్చి కూతలు కూసే పిచ్చి కల్యాణ్ ఇకనైనా అసంబద్ధపు మాటలు కట్టిపెడితే మంచిది. వీకెండ్స్ లో వచ్చి సినిమా స్టోరీలు అల్లి, నాలుగు డైలాగులు చెప్పేసి రాష్ట్రంలో శాంతిభద్రతలను విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడితే మంచిదే కానీ, మా ప్రభుత్వాన్ని, మా వైయస్ జగన్‌ని ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరు. -మీ భరతం పట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, భీమవరం, గాజువాకల్లో ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పవన్ కల్యాణ్ ఓటమి ఖాయం. చంద్రబాబు, పవన్ కు సహకరించే రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఎంతమంది కుట్రలు చేసినా వైయస్సార్ సీపీని, వైయస్ జగన్‌ని ఇంచి కూడా కదిలించలేరు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తిని ఎదుర్కొవాలంటే వీళ్లకు తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యపడదు. కాబట్టే ఇద్దరూ కూడబలుక్కుని దరిద్రమైన రాజకీయాలు చేస్తున్నారు. ఒంటరిగా వచ్చినా, కలిసి వచ్చినా ఎక్కడైనా సరే ఓడిపోవడం ఖాయం.