వైయ‌స్ జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా?

28 Dec, 2023 16:29 IST

 తాడేపల్లి:  రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి లాంటి ముఖ్య‌మంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నారా? అని మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌శ్నించారు. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా? అని ఆయ‌న నిల‌దీశారు. తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి  మండిపడ్డారు. టీడీపీ దివాళా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదనీ తెలుసని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడారు. 

 రాజకీయ దివాలాకోరు చంద్రబాబుః
తెలుగుదేశం పార్టీది ప్రస్తుతం ఉనికి కోసం చేసే పోరాటమే. రేపటి ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీచేసే సత్తా లేదన్న సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇక, చంద్రబాబు రాజకీయాల్లో దివాలా తీసిన నాయకుడిగా మిగిలిపోయాడు. ఎవరికీ పట్టని దిక్కుమాలినోడిగా అతను తన పార్టీ పరువు నిలబెట్టుకునేందుకు ఎవరెవరి కాళ్లు పట్టుకుని పొత్తుల కోసం పాకులాడుతున్నాడో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత, మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్మూధైర్యం, సత్తాలేకనే చంద్రబాబు పొత్తుల బేరాలకు వెళ్తున్నాడు. మరి, ఆ పార్టీ పరిస్థితి అలా ఉంటే.. ఈరోజు అచ్చెన్నాయుడును పార్టీ ఆఫీసులో పెద్ద ముత్తైదువలా కూర్చోబెట్టి, వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో హామీల అమలు గురించి మాట్లాడించడం చాలా సిగ్గుచేటు.  

ఫెయిల్డ్‌ పార్టీ-దివాలా బాబుః
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,  అన్నిపేద వర్గాల సోదరులు, అక్కచెల్లెమ్మలంతా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పట్ల చాలా సంతోషంగా ఉండటమనేది తెలుగుదేశం పార్టీకి జీర్ణించుకోలేని అంశమైంది. అందుకే, మా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను నెరవేర్చడంలో ఫెయిల్‌ అయిందంటూ అచ్చెన్నాయుడులాంటి పెద్ద ముత్తైదువ అంటుంది. నిజాలు గ్రహిస్తే.. ఆ పార్టీలో ఉన్న నాయకులంతా గుండెపగిలి చస్తారు. చంద్రబాబు హయాంలో తన సొంత సామాజికవర్గం మినహా అన్ని సామాజికవర్గాల అభివృద్ధిని గాలికొదిలేసి.. ఎన్నికల మ్యానిఫెస్టో హామీల్ని చెత్తబుట్టదాఖలా చేసినందుకు 2019లో ప్రజలు తగిన బుద్ధిచెప్పారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో సుమారు 650 హామీలిచ్చిన చంద్రబాబు వాటిల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చారా..? పైగా, ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని,  పార్టీ వెబ్‌సైట్‌ నుంచే తొలగించి మాయం చేసిన నీచుడుగా ముద్ర పడి ప్రజల దృష్టిలో ఫెయిల్డ్‌ పార్టీ- దివాలా నేతగా చంద్రబాబు పేరుతెచ్చుకున్నాడు. 

ఏపీలో బాబుకు అడ్రస్ ఏదీ..?
చంద్రబాబు నాన్‌లోకల్‌ పొలిటికల్‌ నేత అనేది అక్షరసత్యం కాగా, అచ్చెన్నాయుడు మాత్రం వారి నాయకుడి ఇల్లు ఆంధ్రలో ఉందని చెబుతాడా..? ఇక్కడ చంద్రబాబుకు ఇల్లు ఎక్కడుందయ్యా ..? ఆయన ఇంటి డోర్‌ నెంబర్‌ ఎక్కడ..? ఆయన ఆధార్‌కార్డు ఎక్కడుంది..? అని నేనడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటూ సిగ్గులేకుండా ఈ రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చిపోతున్న చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడే హక్కు ఎక్కడుందని నిలదీస్తున్నాను. కొద్దిరోజులు అక్కడ.. మరికొద్ది రోజులు ఇక్కడ ఉంటూ రాజకీయాలు చేసే నాయకుడి నాయకత్వానికి ఏమైనా విలువ, విశ్వసనీయత ఉంటాయా..? మరి, అలాంటి నాయకుడి నేతృత్వంలో పనిచేసే పార్టీ కేడర్‌కు ఏమైనా గ్యారెంటీ ఉంటుందా..? అని ప్రశ్నిస్తున్నాను. అచ్చెన్నాయుడులాంటోళ్లు అనవసరంగా మా ప్రభుత్వంపై నోరు పారేసుకోవడమే గానీ వాళ్ల పార్టీ నాయకుడే వాళ్ల భవిష్యత్తుకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేడని తెలుసుకోవాలి. 

రుణమాఫీ హామీల్ని ఎగొట్టింది మీరేగా..?
చంద్రబాబు ఆనాడు రైతులకు రుణమాఫీపై హామీ ఇచ్చి చేతులెత్తేసిన సంగతి అచ్చెన్నాయుడుకు గుర్తులేదా..? మరి, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకూ రుణాలన్నీ మాఫీ చేస్తామని పైసా కూడా చెల్లించకుండా.. వారి శాపనార్థాలకు గురై 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి పరాభవం పొందిన సంగతిని ప్రత్యేకంగా గుర్తుచేయాల్నా..?  కాబట్టే.. టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైందన్న విషయం అచ్చెన్నాయుడికి గుర్తుచేయాల్నా.? నిరుద్యోగులకు నిరుద్యోగభృతిని ఇస్తామని వారిని మభ్యపెట్టి మోసం చేసిన చంద్రబాబును ప్రజలు మరిచిపోమన్నా మరువలేరు. మేనిఫెస్టో అంటే టీడీపీకి ఎందుకూ పనికిరాని ఒక చెత్త కాగితం. 

టీడీపీ మేనిఫెస్టో హామీలపై చర్చకొచ్చే దమ్ముందా..?
చంద్రబాబు తొలుత అధికారం చేపట్టినప్పటి నుంచి  2014 వరకు,  తెలుగుదేశం ఎన్నికల మ్యానిఫెస్టోలపైన కూడా చర్చ జరగాలి. చంద్రబాబు, అచ్చెన్నాయుడుతో సహా ఆ పార్టీ నేతలందరికీ నేనొక సవాల్‌ విసురుతున్నాను. మీరు మా పార్టీ మ్యానిఫెస్టో హామీల గురించి మాట్లాడటం కాదు. మీకు నిజంగా దమ్మూ,ధైర్యముంటే, 1995 నుంచి 2014లో మీ నాయకుడు చంద్రబాబు ప్రజలకు ఏమేమి హామీలిచ్చారో.. వాటిల్లో ఏం నెరవేర్చారో చెప్పే సత్తా ఉందా..? మీ హయాంలో మీరు ఏం చెప్పి.. ఏం చేశారో.. మేము మా మ్యానిఫెస్టో హామీల్ని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశామో చర్చిందాం రండి. చర్చా వేదిక, సమయం మీరు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎక్కడ చర్చిద్దామన్నా.. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము వస్తాం.    

99.5 శాతం హామీల్ని నెరవేర్చిన నేత జగన్‌గారుః
నమ్మకం అంటే వినిపించే పేరు జగనన్న.. విలువలు, విశ్వసనీయ కలిగిన నేతంటే జగనన్న పేరే తప్ప మరొకరు గుర్తుకురారు. అలాంటి సమర్ధుడైన నాయకుడి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోను ఒక పవిత్రగ్రంథంలా పూజిస్తోంది. ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ మరువకుండా ఆయనతో పాటు మమ్మల్ని కూడా క్రమశిక్షణతో నడిపి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనసున్న నేతగా నిలిచారు. మాట తప్పకుండా.. మడమతిప్పకుండా ‘నవరత్నాలు’ ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ 99.5 శాతం హామీల్ని నెరవేర్చినట్లు మేము దమ్ముగా చెబుతున్నాం. దీనికి రుజువులతో సహా నిరూపిస్తాం.

ప్రజాదరణ ప్రభుత్వం మాదిః
మా నాయకుడు జగనన్న నేతృత్వంలో ఈ ప్రభుత్వం సుభిక్షమైన పరిపాలన చేయడంతో ఈరోజు ఎక్కడ చూసినా.. మా పార్టీకి విశేష ప్రజాదరణ లభిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలుగా మేము రాష్ట్రంలో ఇంటింటికీ తిరిగి మా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల గురించి ప్రతి గడపకూ వెళ్ళి వివరించాం.  ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. లబ్ధిదారుల మాటల్లో మా నాయకుడు జగనన్న గొప్పదనం మరింతగా మాకు తెలుసొస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలంతా వైఎస్‌ఆర్‌సీపీ నాయకుల్ని అక్కునజేర్చుకుని ఆశీర్వదిస్తున్నారంటే.. అది ఒక్క మా నాయకుడు జగనన్న గొప్పదనమేనని చెప్పాలి. ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఆయన దార్శనికుడిగా.. ఆలోచన చేసి అమలు చేస్తోన్న నవరత్నాలే ఈరోజు మా పార్టీకి శ్రీరామ రక్షగా నిలిచాయని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో ఈరోజు దాదాపు 65 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాం. కులాలు, మతాలు, రాజకీయాలు, ప్రాంతాలతో సంబంధంలేకుండా డీబీటీ ద్వారా రూ.2.41 లక్షల కోట్లు సంక్షేమాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నాం.    

వై నాట్‌ 175 దిశగా అడుగులేస్తున్నాంః
మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌గారి నేతృత్వంలో రాష్ట్రం సంక్షేమం-అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో .. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులతో పాటు అగ్రవర్ణ పేదలంతా మమ్మల్ని మరోసారి అశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు. కనుకే,  2024 ఎన్నికల్లో ‘వై నాట్‌ 175’ దిశగా అడుగులేస్తున్నాం. మా టార్గెట్‌ను చేరువయ్యేందుకు ఇంకా కొద్దిరోజులే సమయం ఉంది. మరోమారు మా నాయకుడు జగనన్న ముఖ్యమంత్రికాబోతున్నారనేది తథ్యం. దీంతోపాటు ఈ రాష్ట్రానికి ఎలాంటి సంబంధంలేని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 నాయుడు చాపాదిండు సర్దుకుని పక్కరాష్ట్రాలకు పారిపోవాల్సిందేనని గుర్తుచేస్తున్నాను.