బాబు ఉంటోంది వెల్‌నెస్‌ సెంటర్‌లో కాదు.. సెంట్రల్‌ జైల్లో..

11 Oct, 2023 12:41 IST

విశాఖ: అస్వస్థతకు గురైనట్టు చెప్పి చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారని, చంద్రబాబు ఉంటుంది వెల్‌నెస్‌ సెంటర్‌లో కాదు.. సెంట్రల్‌ జైల్లో అని గుర్తుపెట్టుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.  నేరం చేసిన వారి కోసమే జైళ్లు పెట్టారన్నారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే జైల్లో ఉన్నారని, బాబు అరెస్టు రాజకీయ పరమైన అంశం కాదని, కావాలని ఎవరూ జైల్లో పెట్టలేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చాలా స్పష్టంగా చెప్పారన్నారు. 

చంద్రబాబు అవినీతి చేశారు కాబట్టే దాని నుంచి తప్పించుకునేందుకు దేశంలోని అన్ని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడన్నారు. చేసిన తప్పుకు శిక్ష పడినప్పుడు దాన్ని పొలిటికల్‌ అంశంగా చూపించి రాజకీయ లబ్ధిపొందాలని టీడీపీ చూస్తోందన్నారు. చంద్రబాబు ప్రజల్లో ఉన్నా, జైల్లో ఉన్నా రాష్ట్ర ప్రజల దృష్టిలో పెద్ద తేడా ఉండదని సీఎం చెప్పారన్నారు. చంద్రబాబుకు ఇన్‌కం ట్యాక్స్‌నోటీసులు ఇస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సబంధం, ఈడీ ఇన్వాల్వమెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను అధికారులు వెలికి తీయడంతో ప్రొసీజర్‌ ప్రకారం అరెస్టు జరిగిందని మంత్రి గుడివాడ అమర్‌ చెప్పారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో సీఐడీ విచారణ తర్వాత నారా లోకేష్‌ సెల్ఫ్‌ సర్టిఫైడ్‌ మేధావిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.