వైయస్ఆర్ జిల్లా ఉక్కు నగరంగా అవతరించబోతోంది
వైయస్ఆర్ జిల్లా: తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కలను తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేస్తున్నారని, స్టీల్ ప్లాంట్‌తో వైయస్ఆర్ కడప జిల్లా ఉక్కునగరంగా అవతరించబోతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు.
‘దాదాపు 15 సంవత్సరాల కల. ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలనే గొప్ప ఆలోచనతో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అడుగులు వేశారు. లక్షలాది మంది ప్రజల కలను నిజం చేయాలి. వేలాది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మహానేత వైయస్ఆర్ ఆలోచన చేసిన గొప్ప కార్యక్రమం ఇది. ఈ ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్ పెట్టాలని ఆలోచన చేసినప్పుడు దానికి అడ్డంకులు సృష్టించాలని ఏరకంగా కుయుక్తులు పన్నారోఅందరికీ తెలుసు. అప్పట్లో ఉన్న కొన్ని పత్రికలు ఏం రాశాయో అందరికీ తెలుసు. ‘‘తొండలు కూడా గుడ్లు పెట్టనటువంటి చోటును తీసుకొచ్చి ప్రకృతి వనాలు అంటూ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని లేనిపోని వార్తలు రాశారు’’ అని ఆనాడు అసెంబ్లీలో వైయస్ఆర్ చెప్పారు.
2019లో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తరువాత డిసెంబర్ 23వ తేదీన స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. తరువాత కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచం అతలాకుతలమైంది. అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కోవిడ్ వల్ల రెండేళ్లు ఆలస్యమైనప్పటికీ.. స్టీల్‌ప్లాంట్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకువచ్చిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
ఆరోజున వైయస్ఆర్ హయాంలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అనేక అడ్డంకులు సృష్టించారు. ఈరోజు ఎన్ని అడ్డంకులు సృష్టించిన వైయస్ జగన్‌ను ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదు. తండ్రి కలను సీఎం వైయస్ జగన్ సాకారం చేస్తున్నారు. రూ.8,800 కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ఉపాధి కల్పిస్తూ వైయస్ఆర్ జిల్లాను ఉక్కునగరంగా తీర్చిదిద్దుతున్నారు. వైయస్ఆర్ కడప జిల్లా ఉక్కు నగరంగా అవతరించబోతోంది.
గొప్ప నాయకులను రాష్ట్రానికి అందించిన వైయస్ఆర్ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గొప్ప నాయకుడితో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన ప్రజానీకానికి ధన్యవాదాలు. రాబోయేకాలంలో మరింతగా కడప ప్రాంత అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేస్తాం’ అని మంత్రి గుడివాడ అమర్ చెప్పారు.