పాలనలో అనూహ్య సంస్కరణలు తీసుకు వచ్చాం
గోపాలపురం: పాలనలో అనూహ్య సంస్కరణలు తీసుకు వచ్చాం అని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు తెలిపారు. గోపాలపురంలో వివిధ భవనాల ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 90 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయ భవనాన్ని,21.80 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని,40లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు,జిల్లా ఇంఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."పాలన సంబంధ వికేంద్రీకరణ ద్వారా వచ్చిన ప్రయోజనాలు అందరూ అందుకునే స్థితికి నాలుగేళ్లలో తీసుకు వచ్చాము. పాలన సంబంధ సంస్కరణలను మొదట్లో చాలా మంది వ్యతిరేకించారు. ఈ రోజు అందరూ అంగీకరిస్తున్నారు. మనం అనుసరించిన ని ష్పాక్షిక పరిపాలన వలన,ఎలాంటి ఆంక్షలూ లేని ఎంపిక విధానం వలన ప్రజల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇవాళ సామాన్యుడు తాను ఎవరికి సలాం చేసి బతకాల్సిన పని లేదు. రాజ్యాంగం ఇచ్చిన అన్ని ఫలాలను ప్రభుత్వం వల్ల పొందగలుగుతున్నాను అన్న నమ్మకం, ఆత్మాభిమానం పౌరుల్లో కలిగించాము.
గడిచిన కాలం లోని ప్రభుత్వాల్లో సంక్షేమ పథకాలు అందాలి అంటే గ్రామాల్లో ఉండే పెద్దలకు లోబడి సలాం కొట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. నిరంతరం బితుకు..బితుకుమంటూ..బ్రతికే వారు. నేడు ఆ పరిస్థితిని జగన్ సర్కారు పరిపూర్ణంగా మార్చేసింది. రూపు మాపేసింది. వైఎస్సార్సీపీకి ఓటు వేయని వారు మీ ఆత్మ విమర్శ చేసుకోండి. మీరు ఎంత ప్రయోజనం పొందారో. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చాయో. ఇంటి మీద జెండా కట్టి, పార్టీకి ఓటు వేస్తేనే పథకాలు వచ్చే పరిస్థితి నుంచి హక్కుగా పొందే రోజుకు తీసుకువచ్చాము.
సీఎం వైయస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూశారు. అధికారంలోకి వస్తే,ఫలానా విధంగా పని చేసి చూపిస్తాం అని ఆ రోజు చెప్పారు. అన్న విధంగానే అని వర్గాలకూ మేలు చేసి,ఇచ్చిన మాటకు కట్టబడి ఉన్నారు సీఎం జగన్.ఇచ్చిన మాట తప్పే రకం కాదు జగన్. ప్రజల కోసం తండ్రిలానే ఆలోచించే రకం. విశ్వసనీయత కలిగిన నాయకుడు. వివిధ మార్గాల ద్వారా సే కరించిన నిధులతో రాజ్యాంగబద్దంగా పాలన చేయాలి అని సీఎం జగన్ భావిస్తున్నారు. దీనిని పార్టీ నాయకులు అర్థం చేసుకోవా లి. కొన్ని పనులు ఆలస్యం అవ్వొచ్చు. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. దేశంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం కావొచ్చు. ఇతరేతర కారణాలు కావొచ్చు. అయినా కూడా ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం.
ఈ ఐదేళ్లలో మన దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ,సంబంధిత పరిష్కారాలు వెతుకుతూ మళ్ళీ ఎన్నిక లకు నిర్థిష్ట ప్రణాళికతో వస్తాము. తద్వారా అందరికీ మంచి జరుగుతుంది. అవినీతి లేని పాలన అందిస్తున్నాము. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లలో అనేక మంది నాయకుల్లో పథకాల అమలు విషయమై అవినీతి లేకుండా చేయలేకపోయామన్న ఆవేదన ఉం డేది. ఒక ప్రధాన మంత్రి,ఒక సందర్భంలో..గ్రామీణ ప్రాంతాల వారి కోసం వెచ్చించే డబ్బు,90 శాతం మధ్యవర్తులకు, లంచాలకు వె ళ్ళిపోతుందని బహిరంగంగానే ఆవేదన చెందారు.రాష్ట్రంలో నేడు, సుమారు. రూ.2.7 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాము. అం దుకు గాను ఎక్కడైనా పైసా లంచం తీసుకున్న,ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ మార్పును ప్రజలంతా గమనించాలి.
రెవెన్యూ శాఖలో అనేక మార్పులు తీసుకు వచ్చాం. వందేళ్ల కిందట చేసిన భూసర్వేను మళ్లీ ఇప్పుడు చేయించాం. భూ సర్వే సమగ్రంగా చేయించకపోవడం వల్ల గ్రామాల్లో తగాదాలు నడిచేవి. అశాంతికి నిలయంగా గ్రామాలు ఉండేవి. అనేకమంది తమ న్యాయమయినటువంటి ఆస్తిని పొందలేకపోయాయి. గడిచిన కాలంలో ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు. ఓట్లు వస్తాయా లేదా అన్నవి చూశారే కానీ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు మూల కారణం అయిన విషయాలపై దృష్టి సారించకపోవడం వల్లే ఇవన్నీ జరిగాయి. ఆస్తికి సంబంధించిన వివాదాలే ఎక్కువగా గ్రామాల్లో నెలకొని ఉండేవి.
అన్నదమ్ముల మధ్య, సొంత కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు అన్నవి విపరీతంగా నెలకొని ఉండేవి. కారణం అపోహ. కారణం భూ వివాదం. వీటిని అడ్డుకునేందుకు సర్వే చేయిస్తున్నాం. రెండు వేల గ్రామాల్లో సర్వే చేస్తున్నాం. మిగతా ప్రాంతాలలో సర్వే చేయిస్తున్నాం. డ్రోన్లతో సర్వే చేయిస్తున్నాం. ఎవరి ఆస్తిపై వారికి అవగాహన వస్తుంది. క్లియర్ టైటిల్ అన్నది ఉన్న కారణంగా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. రుణాల కారణంగా వాటిని వేర్వేరు మార్గాలలో వెచ్చిచండం ద్వారా ఎంప్లాయిమెంట్ జెనరేట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇండస్ట్రీలు వస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. జీడీపీలో రెండు శాతం పెరుగుదలకు సర్వే అన్నది ఉపయోగపడుతుంది.
రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నది మదర్ డిపార్ట్మెంట్. అన్ని శాఖలకు ఇది తల్లి వంటిది. పౌరులకు సంబంధించిన అనేక విషయాలను డీల్ చేస్తుంది. కనుక ఇక్కడ కొంత అసంతృప్తి చెందేందుకు వీలుంటుంది. దీనిని సంస్కరించేందుకు పాలక ప్రభుత్వాలు పనిచేయాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వాన నడుస్తున్న ప్రభుత్వంలో చాలా మార్పులు తీసుకు వచ్చాం. సంస్కరణలు తీసుకు వచ్చాం. స్వాతంత్ర్యం వచ్చిన ఎనభై ఏళ్లలో ఎన్నడూ చేయని విధంగా సంస్కరణలు తీసుకు వచ్చాం. ఇది మరింత కాలం తరువాత వీటి ఫలాలు మీకు అర్థం అవుతాయి. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని కలిస్తే కానీ పని అవ్వదు అన్న విధానానికి చెక్ పెడుతూ పాలన పరంగా సంస్కరణలు వేగవంతం చేస్తూ ఉన్నాం.
రెవెన్యూ శాఖలో అనూహ్య మార్పులు కారణంగా త్వరలోనే ఫలాలు అందుకుంటారు. ఈనాం చట్టంలో కూడా సవరణలు చేశాం. అలానే ప్రభుత్వ భూమిని మరింతగా పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భూమి అన్నది ప్రజల వద్దకు చేర్చాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. టైటిల్ విషయమై ఎటువంటి గందరగోళం అన్నది లేకుండా ఉండాలి. ప్రజలను ఆస్తి పరులను చేసి సమాజంలో గౌరవం పెంచేందుకు కృషి చేస్తున్నాం. భూమిని, ఆస్తిని సంబంధిత చట్టాలను సవరించేందుకు కూడా కృషి చేస్తున్నాం.
సర్వీస్ ఈనాం లో కూడా మార్పులు తీసుకు వస్తున్నాం. అవినీతి రహిత పాలన అందించేందుకు పని చేస్తున్నాం. ప్రజలు అందుకునే గౌరవానికి మనమే బాధ్యులం. బీదలకు ప్రత్యేక హోదాను కల్పించిన కాలం ఇది. రాజ్యాంగం ఇచ్చిన విషయాలను విస్మరించడం తగదు. మార్పు వచ్చినప్పుడు, సంబంధిత సంస్కరణలు తీసుకు వచ్చినప్పుడు వీటిని స్వాగతించి, వీటిని అర్థం చేసుకోవాలి. గ్రామంలోనే రిజిస్టర్ చేసే విధంగా అవకాశం ఇస్తున్నాం.
రెండేసి రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వకుండా చర్యలు చేపడుతున్నాం. బలహీనుడు తన ఆస్తిని సులువుగా రుజువు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నాం. డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వకుండా సిస్టమ్ లో మార్పులు తీసుకు వచ్చాం" అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్ రామ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్,శాసన సభ్యులు తలారి వెంకట్రావు , జక్కంపూడి రాజా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.