బాధ్యతలు చేపట్టిన మంత్రి ధర్మాన కృష్ణదాస్
అమరావతి: రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు నాలుగేళ్లపాటు చెల్లుబాటయ్యేలా తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ.. బియ్యం కార్డు ఉన్నవారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదన్నారు. ఆగస్టు 15వ తేదీన 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్నామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఫ్రెండ్లీ రెవెన్యూ వ్యవస్థకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములను రీ సర్వే చేసి రికార్డులను నవీకరించనున్నామన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిపిస్తున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వరమే సేవలు అందిస్తున్నామని వివరించారు.