విశాఖలో పేదలందరికీ ఇళ్ల పట్టాలిస్తాం
విశాఖపట్నం: ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే సీఎం వైయస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 2,47,013 మందిని లబ్ధిదారులుగా గుర్తించామని, అందులో జీవీఎంసీ పరిధిలో 1,75,760 మంది ఉన్నారన్నారు. విశాఖ కార్పొరేషన్ పరిధిలో చిన్న చిన్న స్థలాలు తప్ప.. ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి లేదని, ఈ మేరకు చుట్టుపక్కల ఉన్న 10 మండలాలను పరిశీలించామన్నారు. ఆనందపురం, భీమిలిపట్నం, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, పరవాడ, గాజువాక, పెదగంటియాడ, విశాఖపట్నం రూరల్ అనకాపల్లి మండలాల్లో సర్వే కోసం రెవెన్యూ, ఫారెస్టు, సర్వే డిపార్టుమెంట్, హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులను 38 టీమ్‌లుగా నియమించి వారి ద్వారా సుమారు 6,116.50 ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను, ఎంజాయ్మెంట్ భూములను గుర్తించామన్నారు. విశాఖలోని వైయస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘అసైన్డ్ భూమిపై సాగు చేసుకునే అవకాశం మాత్రమే ఉంది. దాంతో పాటు ఎవరైతే ఎంజాయ్మెంట్ పేరుతో ఉంటారో.. వారు సాగు చేసుకునే అవకాశం ఉంది.. ప్రభుత్వానికి అవసరం ఉంటే వారిని తొలగించే హక్కు కూడా ఉంది. ఈ నిబంధనలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్వహించి వారందరినీ ఒప్పించడం జరిగింది. ఎకరం అసైన్డ్ భూమి ఇచ్చిన వారికి వీఎంఆర్డీఏ ద్వారా డెవలప్మెంట్ చేసిన ప్లాట్లను 900 గజాలు, ఎంజాయ్మెంట్ చేసిన వారు 10 సంవత్సరాల పైబడి ఉంటే 450 గజాలు, ఐదు సంవత్సరాల పైబడి ఉంటే 250 గజాలు, సమావేశాలు పెట్టి ఒప్పించి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది. ప్రభుత్వానికి భూమి దఖలు పరుస్తారో.. ఆ లబ్ధిదారుడి పేరిటనే తిరిగి ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. ఆ తరువాత అమ్ముకునే హక్కును కూడా కల్పించడం జరుగుతుంది. 6116.50 ఎకరాల భూమిలో 58 బ్లాక్‌లుగా విభజించాం. ఇప్పటికే 25 బ్లాక్‌లు ప్రభుత్వానికి ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే మిగతా బ్లాక్‌లు పూర్తవుతాయి. ఎవరిపై ఏ విధమైన ఒత్తిడి చేయడకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియ చేశాం. రిటర్న్ ప్లాట్స్ డెవలప్మెంట్ కోసం రూ.150 కోట్లను విడుదల చేయాలని వీఎంఆర్డీఏకి ఆదేశాలిచ్చాం.
తెలుగుదేశం పార్టీ చేసిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ రియలెస్టేట్ కోసం చేసింది. వారి ఆస్తులు పెంచుకోవడానికి జీఓలు ఇచ్చారు. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ఇవాళ విశాఖపట్నంలో సుమారు లక్షా 76 వేల మందికి ఇళ్లు ఉండాలనే మా ప్రభుత్వ ఉద్దేశాన్ని మిషన్ మోడ్‌లో చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని సీఎం వైయస్ జగన్ ధ్యేయం. ఎవరెన్ని నిందలు మోసినా పట్టించుకోం.. పారదర్శకంగా పకడ్బందీగా అమలు చేస్తాం. ఏదైనా అలసత్వం, అవినీతి జరిగినా క్షమించమని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. పేదల కోసం కమిట్ మెంట్‌తో పనిచేస్తున్న ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు. గతంలో టీడీపీ భూదందాను ఆధారాలతో సహా చూపించాం.
అవినీతి ఆరోపణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారిని సస్పెండ్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం మరో అధికారిపై ఐటీ దాడులు చేస్తోంది. వారు చంద్రబాబు హయాంలో ఇంటలిజెన్స్ డీజీగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు అయితే.. ఇంకొకరు చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ. ఏబీ వెంకటేశ్వరరావుపై చర్య కక్షపూరితమని టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. మరి ఐటీ దాడులు జరుగుతున్నందుకు మీ పీఎస్‌పై కూడా కక్షపూరితమేనా..? పీఎస్ మీద ఐటీ దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు. బాబు వత్తాసు పలికే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎందుకు స్పందించడం లేదు.. దీనికి కారణం ఏంటీ..? ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వస్తే మాత్రం సస్పెండ్ చేయకూడదా..?
హుద్ హుద్ తుపాను వస్తే ఎక్కడో ఆనందపురంలో ఉన్న రికార్డులు మారిపోతాయా..? భూదందాలకు పాల్పడిన టీడీపీ నేతలు ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు 3 వేల ఎకరాలు, 6 వేల ఎకరాలు, లక్ష ఎకరాలు దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పలానా వారు చేశారని ఆధారాలతో సహా చూపించే దమ్ముందా..? లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.
విశాఖను రాజధానిగా ఎవరు అడిగారని అంటున్నారు. ఉత్తరాంధ్రప్రజలుగా మాకు బాధ్యత లేదా..? విశాఖ అభివృద్ధి చెందాలని అడిగాం.. ఉత్తరాంధ్ర అభివృద్ధి అయ్యన్నపాత్రుడికి అవసరం లేదేమో..? మాకు అవసరం.. ఈ రాష్ట్రంలో 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి.. ఈ ప్రాంతం కూడా బాగుపడాలి. రాష్ట్రం అంటే ఒక ప్రాంతం కాదు.. రాష్ట్రం అంటే ఒక సామాజిక వర్గం కాదు.. రాష్ట్రం అంటే 13 జిల్లాలు, 5 కోట్ల మంది ప్రజలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, మాజీలు వీళ్లే ప్రజలు.. ఇంకెవరూ మనుషులు కాదనేది టీడీపీ ఉద్దేశం.
మూడు రాజధానులు చేయడానికి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి నిర్ణయం తీసుకున్నాం. మీలా వ్యాపారస్థులతో కమిటీ వేసి చేయలేదే.. మూడు కమిటీల వేసి నివేదికలను పరిశీలించి నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేశాం. విభజన నాటికి రూ. 45 వేల కోట్ల అప్పులు ఉంటే.. దాన్ని రూ.2.50 లక్షల కోట్లకు తీసుకెళ్లింది. రాజధాని నిర్మించాలంటే రూ. లక్షా 9 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయడానికి ఆర్థిక స్తోమత సరిపోదని, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉంది కాబట్టి.. ప్రాంతీయ అసమానతలు రాకుండా నిర్ణయం తీసుకున్నామని సీఎం వైయస్ జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. విశాఖను వైయస్ఆర్ అభివృద్ధి చేశారు.. ఏ డిబేట్‌కు అయినా నేను రెడీ.. ఎస్సీజెడ్, ఫార్మాసిటీ, ఐటీని మా టైమ్‌లోనే తీసుకువచ్చాం. కాదని చంద్రబాబు చెప్పగలడా..? విశాఖపట్నంలో 5 వేల కోట్లు ఖర్చు చేస్తే మహానగరంగా రూపొంది ఉద్యోగాలు వస్తాయి. మా ప్రభుత్వానిది అంతా రియాలిటీ.. 5–10 సంవత్సరాల్లో హైదరాబాద్‌కు దీటుగా తయారు చేయాలనేది మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రధాన ఉద్దేశమని బొత్స సత్యనారాయణ వివరించారు.