చంద్రబాబు చెప్పిందే నిమ్మగడ్డ చేస్తున్నారు
తాడేపల్లి : చంద్రబాబు నాయుడు ఏం చెబితే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు సలహాలు ఇచ్చే స్థాయి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు లేదని వ్యాఖ్యానించారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నిమ్మగడ్డకు ఎన్నికల బాధ్యత ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. కరోనా దృష్ట్యా ఎన్నికలు సాధ్యం కాదని అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.
జనవరిలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని, ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు 2, 3 నెలల సమయం పడుతుందని చెప్పారు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధానే చెప్పారన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తీర్మానం చేశామని మంత్రి పేర్కొన్నారు.