రామతీర్థం ఘటన ప్రతిపక్షాల కుట్రే
విజయవాడ: రామతీర్థంలో జరిగిన ఘటన ప్రతిపక్షాల కుట్రేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై బురదజల్లాలనే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రామతీర్థంలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జరిగిన ఘటన ప్రజలందరి మనోభావాలకు సంబంధించిన అంశమని, ఏ ఒక్క పార్టీకో, వ్యక్తికో సంబంధించింది కాదన్నారు. కొందరు దుండగులు ప్రభుత్వంపై బురదజల్లాలనే దురుద్దేశంతో చేసిన పనిగా తెలుస్తుందన్నారు. సరిగ్గా సమయం కూడా డిసెంబర్ 30వ తేదీన సీఎం వైయస్ జగన్ విజయనగరం వస్తున్నారని తెలిసి, ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి ఈ కుట్రకు పాల్పడినట్లుగా తెలుస్తుందని, పోలీస్ బృందాలు విచారణ చేస్తున్నాయని .. ఒకటి రెండ్రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వస్తాయన్నారు.
తన భార్య ఝాన్సీ ఎంపీగా ఉన్నప్పుడు రామతీర్థం గుడి అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున కుటుంబ సమేతంగా రామతీర్థం కొండపైన గుడికి వెళ్తామన్నారు. తమ కుటుంబం గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు.
చంద్రబాబు ప్రతీది రాజకీయం చేస్తూ.. రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఘటన జరిగిందని తెలిసిన వెంటనే ∙ఎస్పీని ఘటనా స్థలానికి పంపించి ముమ్మర దర్యాప్తు చేయాలని ఆదేశించానన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సంఘటన జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా.. మీ నాయకులను ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. స్థానిక మాజీ శాసనసభ్యుడు, అశోక్ గజపతి రాజు ఎవరూ ఇంత వరకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, పబ్లిసిటీ కోసం ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు ప్రజలకు తెలుసని, తప్పకుండా దోషులను గుర్తించి శిక్షిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.