24న జగనన్న వసతి దీవెన విజయనగరంలో ప్రారంభం
విజయనగరం: ఈ నెల 24న విజయనగరంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జిల్లా నుంచి ప్రారంభించడం శుభపరిణామమన్నారు. సీఎం వైయస్ జగన్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్‌ను సీఎం ప్రారంభిస్తారని మంత్రి పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు ప్రజా చైతన్య యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని డిమాండు చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లాకు ఏ పరిశ్రమ తెచ్చారో చెప్పాలన్నారు. యువతకు ఉద్యోగాలు ఎలా కల్పించాలో మా ప్రభుత్వానికి బాగా తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడానికి టీడీపీ నేతలు యాత్రలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.