దేవాలయాల కూల్చే చంద్రబాబు మీకు దేవుడా
విశాఖ: దేవాలయాల కూల్చే చంద్రబాబు మీకు దేవుడిలా కనిపిస్తున్నారా అని మంత్రి అవంతి శ్రీనివాస్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఆదివారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీపై సోమవారం మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చిస్తారని ప్రజలు భావించారని... దానికి విరుద్ధంగా జరిగిందని విమర్శించారు. రథయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదా అని వ్యాఖ్యానించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభించలేకపోయారన్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళే హిందువుల్లా మాట్లాడుతున్నారని.. మిగిలిన వాళ్ళు హిందువులు కాదా అని నిలదీశారు. హంగులూ, ఆర్బాటాలు లేకుండా ప్రజలు సంక్షేమం కోసం సీఎం వైయస్ జగన్ పాటు పడుతున్నారని ప్రశంసించారు.
అప్పుడేమయ్యారు?..
చంద్రబాబు హయాంలో దేవాలయాల తొలగించినప్పుడు ఆ పార్టీ వ్యక్తే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడేమయ్యారన్నారు. దేవాలయాల కూల్చే చంద్రబాబు మీకు దేవుడా.. రథయాత్ర ఎందుకు చేస్తున్నారో మరోసారి ఆలోచించండని అన్నారు. సోషల్ మీడియాలో మత విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
మేం అందరి వాళ్లం..
వరదలు, తుఫాన్లు సమయంలో రాష్ట్రం సహయం చేస్తే కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. రాష్ట్ర రైతులు సహయంపై మీకు బాధ్యత లేదా.. మీరు మతాలు, ప్రాంతాలు మధ్య విధ్వేశాలు కలిగిస్తే ఈ ప్రాంత ప్రజలు సహించారు. రాముడు ముందు పుట్టాడా, బీజేపీ ముందు పుట్టిందా? రాముడు అందరి వాడు...మేము ఉదయం నుండి రాముడ్ని స్మరిస్తాం. క్రిస్మస్ శుభాకాంక్షాలు చెప్పినా రాజకీయం చేస్తున్నారు. 2 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. విదేశాల్లో ఏ మతం ఉంది? ముందు మనం మనుషులమని గుర్తించుకోవాలి. రైల్వే జోన్ ఇచ్చి ఇప్పటికీ పనులు ప్రారంభించ లేదు. తెలుగు రాష్ట్రలు అభివృద్దిని కోరుకుంటున్నాయి. మీరు అభివృద్ది మరచి మతాలు, ప్రాంతాల మధ్య రాజకీయాలు చేస్తే అధికారంలోకి రారు అని అవంతి వ్యాఖ్యానించారు.